అన్నవరంలో భూమాయ
ABN , Publish Date - May 03 , 2026 | 12:38 AM
భోగాపురం విమానాశ్రయానికి దగ్గరగా ఉండే భీమిలి మండలం అన్నవరం గ్రామంలో గల భూములను సాగుదారుల పేరు చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దలు చేజిక్కించుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన పెద్దలు
సాగుదారులను అడ్డం పెట్టుకుని కుంభకోణం
వీఎంఆర్‌డీఏతో లేఅవుట్
అంతకుముందే ఒప్పందాలు, అడ్వాన్స్‌లు
లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన స్థలాలు ఎన్నికల ముందు రిజిస్ర్టేషన్
భీమునిపట్నం-రూరల్, మే 2 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం విమానాశ్రయానికి దగ్గరగా ఉండే భీమిలి మండలం అన్నవరం గ్రామంలో గల భూములను సాగుదారుల పేరు చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దలు చేజిక్కించుకున్నారు. ఆ భూముల్లో వీఎంఆర్‌డీఏ ద్వారా లేఅవుట్ వేయించారు. అందులో స్థలాలను 2024 ఎన్నికలకు ముందు, తరువాత తమ పేరిట రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. ఇందుకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకూ తమ వంతు సహకారం అందించారు. ఈ వ్యవహారంలో తహశీల్దార్ నుంచి అప్పటి జిల్లా ఉన్నతాధికారి వరకూ అందరి పాత్ర ఉందని తాజాగా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు నివేదిక సమర్పించారు. ఆ లేఅవుట్‌ను రద్దు చేయాలని సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆ లేఅవుట్‌తో పాటు పరిసర ప్రాంతాల భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారుల అండదండలతో సాగిన ప్రయత్నాల గురించి వాకబు చేయగా అసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సాగుదారుల పేరు చెప్పి...
అన్నవరం సర్వే నంబర్ 101/1లో 199.38 ఎకరాలు ఉంది. ఈ భూమి భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్నందున వివిధ సంస్థలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కొంతభాగాన్ని ఏపీఐఐసీకి అప్పగించగా వారి ద్వారా 40 ఎకరాలు మేఫెయిర్ హోటల్‌కు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ హోటల్‌కు కేటాయించారు. అదే సర్వే నంబర్‌లో గల 30 ఎకరాల్లో 40 మంది సాగుదారులు (అన్నవరం, తూడెం గ్రామాలకు చెందినవారు) ఉన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం లేఅవుట్ వేసేందుకు ఆ భూములను వీఎంఆర్‌డీఏ సమీకరించాలనుకుంది. ఈ విషయాన్ని నాడు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ముందుగానే తెలుసుకుని రైతులతో సమావేశమయ్యారు. బేరం కుదుర్చుకుని కొంత అడ్వాన్స్‌గా చెల్లించారు. ప్రభుత్వ భూముల సాగుదారులుగా తమ మనుషులను కూడా నాటి పెద్దలు రికార్డుల్లో నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సాగుదారులతో అగ్రిమెంట్ పూర్తయిన తరువాత ల్యాండ్ పూలింగ్ విషయం బయటకు వచ్చింది. ఎకరానికి 450 గజాల చొప్పున అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అప్పటికే అడ్వాన్స్ తీసుకుని ఉండడం, పైగా ప్రభుత్వ అండదండలు ఉన్న పెద్దలు కావడంతో అసలైన సాగుదారులు ఏమీ మాట్లాడలేకపోయారు. లేఅవుట్ అభివృద్ధి అనంతరం సాగుదారులకు వీఎంఆర్‌డీఏ హక్కు పత్రాలను ఇచ్చింది. వాటిని ఆధారంగా చేసుకుని సాగుదారుల నుంచి 2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వ పెద్దలు (సుమారు 13,500 గజాలు) రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు.
చుట్టుపక్కల స్థలాలకు ఇక్కట్లు
101/1 ఒకటి సర్వే నంబరులో ఉన్న మత్స్యకారులను బలవంతంగా ఖాళీ చేయించి వారి భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా సాగుబడిలో ఉన్న భూమిని అధికారులు తీసుకుంటే నష్టపరిహారం ఇస్తారు. కానీ ఎటువంటి పరిహారం అందించకుండా 18.7 ఎకరాలను స్వాధీనం చేసుకుని అక్కడ లేఅవుట్ వేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో అల్లిపల్లి లక్ష్మయ్య ఆధీనంలో 1959 నుంచి 18.7 ఎకరాల భూమి సాగులో ఉంది. ఈ భూమికి 1962 నుంచి కడుతున్న ఆస్తి పన్ను రశీదులు ఉన్నాయి. ఈ భూమిని లక్ష్మయ్య తన కుమారుడు అల్లిపల్లి ఎల్లాజీరావు, అతని భార్య పిల్లల పేరుతో 1990లో వీలునామా రాశారు. ఈ వీలునామాను 2020లో పంపక దస్తావేజుగా రాసుకుని నోటరీ చేయించారు. ఈ ప్రకారం లక్ష్మయ్య అతని కొడుకు ఎల్లాజీరావు పేరుతో 3.4 ఎకరాలు, కోడలు సత్యవతి పేరుతో 4.1 ఎకరాలు, ఎల్లాజీరావు కుమార్తెలు (లక్ష్మయ్య మనుమరాళ్లు) ధనలక్ష్మి పేరుతో 3.9 ఎకరాలు, త్రివేణి పేరుతో 3.8 ఎకరాలు, సంధ్యారాణి పేరుతో 3.8 ఎకరాలు పంచుకున్నారు. వాటికి ఆయా పేర్లుతోనే పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఈ భూమిని అప్పటి అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పరిహారం ఇవ్వలేదని ఎల్లాజీరావు తెలిపారు. కాగా ఈ భూమి సమీపంలో ఉన్న పైల రాములమ్మ, అచ్చియ్యమ్మ, సూరి ఎర్రయ్మ సాగులో ఉన్న 14 ఎకరాలు ఉన్నాయి. వారికి ఎటువంటి పత్రాలు లేవు. ఆ భూమి సొంతదారులు దంతులూరి వరహాలరాజు గ్రామం విడిచి వెళ్లిపోయారు. వారు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఈ విషయం తెలునుకుని ఎటువంటి హక్కులేని భూమిలో ఉన్నారంటూ కడపకు చెందిన వ్యక్తులు నామమాత్రపు డబ్బులు ఇచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. తాము ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములను నమ్ముకుని ఉన్నప్పటికీ న్యాయం జరగలేదని అనుభవదారు ఎల్లాజీరావు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన ఈ వ్యవహారంపై సమగ్ర పరిశీలన చేయాలని కోరారు.