భోగి సంబరాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:12 AM
భోగి పండుగను నగరవాసులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే వీధులు, కాలనీలు, అపార్టుమెంట్లలో పిల్లలు, పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వేశారు. సింహగిరిపై భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆలయ ఈవో నున్న సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు.
తెల్లవారుజామునుంచే వీధుల్లో సందడి
సింహగిరిపై భారీగా నిర్వహణ
విశాఖపట్నం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):
భోగి పండుగను నగరవాసులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే వీధులు, కాలనీలు, అపార్టుమెంట్లలో పిల్లలు, పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వేశారు. సింహగిరిపై భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆలయ ఈవో నున్న సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. కొండపై గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక సెట్ ఏర్పాటుచేశారు. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, తప్పెటగుళ్లు, మహిళల కోలాటం చూసి భక్తులు పులకించిపోయారు. నగరంలోని వీధులు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో భోగి పండుగ ఘనంగా జరుపుకున్నారు. బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ వద్ద విశాఖపట్నం గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో భోగి పండుగను వినూత్నంగా జరిపారు. ఆవుపేడతో చేసిన లక్ష పిడకలను సేకరించి వైఎంసీఏ వద్ద కుప్పగా వేసి భోగి మంట వేశారు. దేశీయ గోమయ ఆవుపేడతో చేసిన పిడకలను దహనం చేయడం వల్ల గాలి వాతావరణంలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని సంఘం ప్రతినిధి జేవీ రత్నం అన్నారు. రోడ్లపై భోగి మంటలు వేస్తే చర్యలు తీసుకుంటామన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ జారీచేసిన ఆదేశాలు కొంత ప్రభావం చూపాయి. నగరంలో కొన్నిచోట్ల మినహా చాలా ప్రాంతాల్లో రోడ్డుపక్కన, ఇసుక తిన్నెలపైనా, సిమెంట్ కాంక్రీట్ గచ్చుపై భోగి మంటలు వేయడం కనిపించింది.