ప్రపంచానికి తెలిసేలా ‘భోగాపురం’ ప్రారంభోత్సవం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:53 AM
ల, వెనుకబడిన ప్రాంతాలుగా పేరొందిన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పేర్లు ప్రపంచానికి తెలిసేలా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
మూడు లక్షల మందితో మోదీ సభ
పది వేల బస్సుల ఏర్పాటు: మాధవ్
విశాఖపట్నం, జూలై 23(ఆంధ్రజ్యోతి):
వెనుకబడిన ప్రాంతాలుగా పేరొందిన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పేర్లు ప్రపంచానికి తెలిసేలా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల బీజేపీ అధ్యక్షులతో కలిసి గురువారం ఆయన భోగాపురం విమానాశ్రయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుపెట్టడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. విమానాశ్రయం ఎదుట భారీ అల్లూరి విగ్రహం కూడా ఏర్పాటుచేశారని చెప్పారు. ప్రవేశ మార్గంలో ఉత్తరాంధ్ర కళలు, సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు పెట్టారని, విమానాశ్రయం లోపల అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుచేస్తున్నారని, అక్కడ ప్రధాని మోదీ కాఫీ తాగుతారని తెలిపారు. త్వరలో విమానాశ్రయంలో సరకు రవాణాకు కార్గో టెర్మినల్ ప్రారంభమవుతుందన్నారు. ఆగస్టు ఒకటో తేదీన సుమారు మూడు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పది వేల బస్సుల్లో ప్రజలు వస్తారని, విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని గంటన్నర సేపు ఉంటారని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం 18 కమిటీలు వేశారని, అందులో కూటమి పార్టీల నాయకులు ఉన్నారని, అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పావని, జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న ‘సర్’
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు గడువు శుక్రవారంతో ముగియనున్నది. జిల్లాలో 20.23 లక్షల మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయగా, దాదాపు 90 శాతం ఫారాలు తిరిగి వచ్చాయి. ఆ పది శాతంలో వలసవెళ్లినవారు, చనిపోయినవారు, డూప్లికేట్లు, తదితరాలు ఉన్నాయంటున్నారు. వారి పేర్లను ముసాయిదా జాబితాలో పొందుపరిచే అవకాశం లేదు. అలాగే అందిన ఫారాల్లో 1.5 లక్షల మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ జరగలేదు. వీరంతా 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను ప్రస్తుతం ఎన్యుమరేషన్ ఫారంలో ప్రస్తావించకపోవడంతో డిజిటలైజేషన్‌కు అవరోధం ఏర్పడింది. మరో మూడు లక్షల మంది ఓటర్లు ఇచ్చిన ఫారాల్లో తప్పులు ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు.
ఎండాడలో ఏఐజీ ఆస్పత్రికి 2.16 ఎకరాలు
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):
విశాఖ రూరల్ మండలం ఎండాడలోని సర్వే నంబరు 14/7లో గల 2.16 ఎకరాలను హైదరాబాద్‌కు చెందిన ఏఐజీ (ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఆస్పత్రికి ప్రభుత్వం కేటాయించింది. ఇదే సంస్థకు గతంలో ఏడెకరాలు ఇచ్చింది. దానిని ఆనుకుని తాజాగా 2.16 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో ఏఐజీ యాజమాన్యం నర్సింగ్, అలైడ్ హెల్త్‌కేర్ సైన్స్‌స్ కళాశాలలు ఏర్పాటుచేయనున్నది.