‘భోగాపురం’ గరంగరం
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:57 AM
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 17న ప్రారంభం కాగా...తొలి రోజు నుంచి పార్కింగ్ ఫీజులపై వివాదం నడుస్తోంది.
పార్కింగ్ ఫీజులపై రగడ
గంటల చొప్పున వసూళ్లు
క్యాబ్‌లకు రోజుకు రూ.600
ధర్నాకు దిగిన డ్రైవర్లు
దిగివచ్చిన కాంట్రాక్టర్
రైడ్ లేకుంటే ఫీజు రద్దుకు అంగీకారం
ప్రైవేటు వాహనాలైతే గంటకు రూ.150
విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 17న ప్రారంభం కాగా...తొలి రోజు నుంచి పార్కింగ్ ఫీజులపై వివాదం నడుస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రయాణికులను తీసుకువెళ్లే ప్రైవేటు వాహనాల నుంచి జీఎంఆర్ యాజమాన్యం అధిక మొత్తంలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తోంది. ఈ ధరలు దారుణంగా ఉన్నాయని కారు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణికులను తీసుకువెళ్లేవారంతా, తిరుగు ప్రయాణంలో కిరాయి దొరికేంత వరకూ అక్కడే ఉంటున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి ఐదు గంటలు ఉంటుంది. అంతసేపు విమానాశ్రయం పార్కింగ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి తమ రేట్ల ప్రకారం పార్కింగ్ ఫీజు కట్టాలని కాంట్రాక్టర్ డిమాండ్ చేస్తున్నారు. కమర్షియల్ కార్లకు మొదటి 30 నిమిషాలకు రూ.200, గంట అయితే రూ.300, రెండు గంటలైతే రూ.400, అక్కడి నుంచి ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. అత్యధికంగా రోజుకు రూ.600 తీసుకుంటున్నారు. అదే ప్రైవేటు కార్లు (సొంతం) అయితే మొదటి 30 నిమిషాలకు రూ.100, గంటకు రూ.150, రెండు గంటలకు రూ.200, ఆ తరువాత ప్రతి అదనపు గంటకు రూ.50 చొప్పున అత్యధికంగా రోజుకు రూ.450 వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ ఫీజులను కమర్షియల్ కార్ల డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒక డ్రైవర్ విశాఖ నుంచి రూ.700 కిరాయికి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి కిరాయికి వేచి చూసి చూసి ఇక లాభం లేదని బయటకు వస్తుంటే పార్కింగ్ ఫీజు రూ.600 చెల్లించాలని కారును ఆపేశారు. దాంతో ఆ డ్రైవర్ వారితో ఘర్షణకు దిగారు. కిరాయి రూ.700కి వస్తే, అందులో రూ.600 పార్కింగ్‌కు తీసుకుంటే...ఇక తాము ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో కేవలం రూ.40 మాత్రమే పార్కింగ్ ఫీజు తీసుకునేవారని పేర్కొన్నాడు. అభివృద్ధి పేరు చెప్పి తమను దోచుకుంటారా?...అంటూ తప్పుబట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోరాడి సాధించుకున్నారు
గత మూడు రోజులుగా అక్కడ పార్కింగ్ ఫీజులపై ప్రతి పూట వివాదం జరుగుతోంది. ఇటు నుంచి వెళ్లిన కార్లకు అటు నుంచి కిరాయి దొరకడం లేదు. కొందరు ఆర్టీసీ వేసిన ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కి రూ.250 నుంచి రూ.400కే విశాఖపట్నం వచ్చేస్తున్నారు. కారుకు కనీసం రూ.700 నుంచి వేయి రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అందుకని వాటికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల అక్కడే వేచి చూస్తున్న క్యాబ్ డ్రైవర్లకు కిరాయి లభించడం లేదు. ఎక్కువ సమయం ఉండడం వల్ల పార్కింగ్ ఫీజు రూ.600 కట్టాల్సి వస్తోంది. కిరాయి లేకుండా వెళుతున్నప్పుడు పార్కింగ్ ఫీజు కట్టలేమని వారు తెగేసి చెప్పారు. దీంతో పార్కింగ్ కాంట్రాక్టర్ ఒక మెట్టు దిగి వచ్చారు. భోగాపురం విమానాశ్రయం నుంచి కిరాయి లేకుండా వెనక్కి వచ్చే ఓలా, ఊబర్, రేపిడో, ప్రైవేటు క్యాబ్‌లు ఏవైనా సరే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, దానికి కాంట్రాక్టర్ అంగీకరించారని డ్రైవర్ల సంఘం నాయకులు తెలిపారు. ఇంకా తమ డిమాండ్లు కొన్ని ఉన్నాయని, వాటిపై దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుతానికి కిరాయి లేకుండా బయటకు వస్తే పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు.