Share News

భోగాపురం గందరగోళం

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:15 AM

నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు తొలిరోజు ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు.

భోగాపురం గందరగోళం

సమయానికి రాని ఏరో స్పెషల్‌ బస్సులు

ఇబ్బందిపడ్డ విమాన ప్రయాణికులు

వేళకు చేరుకోలేమనే ఆందోళనతో ట్యాక్సీల్లో పలువురి పయనం

బస్టాప్‌లలో కనీస సదుపాయాలు కరువు

విశాఖపట్నం/గాజువాక/సాగర్‌నగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):

నగరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు తొలిరోజు ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 5.10 గంటల నుంచి విమానాశ్రయానికి ఏరో స్పెషల్‌ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే, ఆరు గంటల వరకూ బస్సులు కనిపించలేదు.

ప్రధానంగా ద్వారకా బస్‌ కాంప్లెక్స్‌ వద్ద గల స్టాప్‌ గురించి ప్రయాణికులకు సమాచారం ఉందో లేదో తెలియదు గానీ అతికొద్దిమంది మాత్రమే వచ్చారు. వారు కూడా బస్సులు సమయానికి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఉదయం 8.10 గంటలకు రావాల్సిన బస్సు 8.45 గంటల తరువాత వచ్చింది. బస్టాప్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో రోడ్డుపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు రోడ్డుపక్కనే లగేజీతో బస్సుల కోసం ఎదురుచూస్తూ కనిపించారు. కొన్ని బస్సులు స్టాప్‌ వద్దకు రాకుండా, పక్క నుంచి వెళ్లిపోవడం కనిపించింది.

ప్రత్యేకంగా ఉండేలా చూడాలని..

ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటుచేసిన స్టాప్‌లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చిన బస్సుల్లో పది మంది వరకు ప్రయాణికులు ఎక్కారు. సాధారణ బస్సులు ఆగే చోటే విమానాశ్రయానికి వెళ్లే బస్సులు నిలపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటి కోసం ప్రత్యేకంగా బస్టాప్‌లు ఏర్పాటుచేయాలని, కూర్చునేందుకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరారు. విశాఖ విమానాశ్రయంతో పోలిస్తే భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని తొలిరోజే ప్రయాణంతోనే అర్థమైందని ఒకరు పేర్కొన్నారు.

గాజువాకలోనూ...

పాతగాజువాక నుంచి ఉదయం 4.55 గంటలకే తొలి బస్సు బయలుదేరుతుందని, తదుపరి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో ఉదయం 4.30 గంటలకే చాలామంది ప్రయాణికులు పాతగాజువాక హైవే బస్టాప్‌ వద్దకు చేరుకున్నారు. అయితే తొలి బస్సు 6.50 గంటలకు రాగా, రెండో బస్సు 10.15 గంటలకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల కోసం నిరీక్షిస్తే కష్టమని భావించిన ప్రయాణికులు చాలామంది కార్లు బుక్‌ చేసుకొని భోగాపురం వెళ్లిపోయారు.


వెలవెలబోయిన విశాఖ విమానాశ్రయం

గోపాలపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి)

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నిత్యం 32 విమాన సర్వీసులు వచ్చివెళుతుండేవి. వాటి ద్వారా రోజుకు సుమారు తొమ్మిది వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. దీంతో నిరంతరం ప్రయాణికులతో విశాఖపట్నం విమానాశ్రయం సందడిగా ఉండేది. అటువంటిది సోమవారం నిర్మానుష్యంగా మారింది. టెర్మినల్‌ భవనం ప్రాంగణం జనాలు లేక వెలవెలబోయింది.

Updated Date - Aug 18 , 2026 | 01:15 AM