Share News

భోగాపురం సంబరం

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:09 AM

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం శనివారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగనున్నది.

భోగాపురం సంబరం

నేడు ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచిలక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు

2,020 బస్సులు కేటాయింపు

ఉదయం అల్పాహారం..మధ్యాహ్న భోజనం

ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా మూడు మార్గాల్లో తరలింపు

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం శనివారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగనున్నది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. భోగాపురంలో జరిగే బహిరంగ సభకు మొత్తం మూడు లక్షల మందిని సమీకరిస్తున్నారు. అందులో సుమారు లక్ష మంది ఉమ్మడి విశాఖ జిల్లా (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) నుంచే వెళుతున్నారు. నియోజకవర్గాల వారీగా జనాల తరలింపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు అప్పగించారు. ముఖ్యంగా మహిళలను తరలించే బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కలిపి 2,020 సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన బస్సులను శుక్రవారం రాత్రే నిర్దేశించిన ప్రాంతాలకు పంపించారు. బస్సులు భోగాపురం మూడు మార్గాల్లో వెళ్లాలని పోలీసు అధికారులు నిర్దేశించారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల వారిని అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి మీదుగా, విశాఖ తూర్పు నియోజకవర్గ వాసులు హనుమంతవాక మీదుగా అడవివరం-శొంఠ్యాం మార్గంలో అక్కడి హైవేకు చేరేలా దిశా నిర్దేశం చేశారు. నగరంలోని ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల వారు ఎన్‌హెచ్‌-16పై నేరుగా వెళ్లేలా ఆదేశాలు ఇచ్చారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి రూట్‌ మ్యాప్‌ ఇచ్చారు. బస్సులన్నీ ఉదయం ఐదు గంటల నుంచి భోగాపురానికి బయలుదేరి వెళతాయి. వీరికి నగర శివార్లలో అల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ముగిసిన తరువాత అక్కడి నుంచి తిరిగి బయలుదేరితే దారి మధ్యలో భోజనాలు ఇస్తారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

భోగాపురానికి వేలాది వాహనాలు వెళుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా శనివారం పరిమితంగా ఆంక్షలు విధించారు. ఉదయం 5 నుంచి పది గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటలకు అత్యవసరం అయితే తప్ప నగర ప్రజలు రోడ్ల మీదకు రావద్దని సూచించారు.

సీఎం సమీక్ష

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకొని పోర్టు గెస్ట్‌ హౌస్‌లో ప్రధాని మంత్రి రాక, విమానాశ్రయం ప్రారంభోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అన్నీ ఘనంగా ఉండాలని ఆదేశించారు.


నగరానికి చేరుకున్న సీఎం

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయనకు కోస్టల్‌ బ్యాటరీ సమీపాన గల హెలిప్యాడ్‌ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, పి.విష్ణుకుమార్‌రాజు, సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, సుందరపు విజయకుమార్‌, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభి, జాతీయ ఉపాధ్యక్షుడు ఎండీ నజీర్‌, పెందుర్తి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్‌, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు, పోర్టు చైర్మన్‌ జితేంద్రసింగ్‌, డిప్యూటీ చైర్మన్‌ అపరంజి రోష్ని, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వి.సతీష్‌కుమార్‌, ఇతర అధికారులు, నేవీ ఉద్యోగులు స్వాగతం పలికారు.


నేడు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సెలవు

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, ఆర్‌ఐవో మురళీధర్‌ శుక్రవారం ప్రకటనలు విడుదల చేశారు. అందరూ ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాగా ప్రధాని సభకు జిల్లా నుంచి జనాల తరలింపు కోసం విద్యాసంస్థలకు చెందిన బస్సులు, మినీ బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే సెలవు ఇచ్చారు.


జనం తరలింపునకు ఏర్పాట్లు

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి జన సమీకరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 69,614 మందిని తరలించడానికి 1,457 బస్సులు సిద్ధం చేశారు. భోగాపురానికి ఆనుకుని ఉన్న భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 31,457 మందిని తరలించనున్నారు. వారి కోసం 633 బస్సులు కేటాయించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి 7,763 మందికి 161 బస్సులు, ఉత్తరం నుంచి 7,611 మందికి 166, తూర్పు నుంచి 6,994 మందికి 152, ‘సౌత్‌’లో 6,228 మందికి 122, గాజువాక నుంచి 5,819 మందికి 131, పెందుర్తి నుంచి 3,772 మందికి 92 బస్సులు కేటాయించారు. బస్సులు ఆయా పాయింట్లకు శుక్రవారం రాత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య బస్సులు ఆయా పాయింట్ల నుంచి బయలుదేరేలా చూడాలని ఇన్‌చార్జులకు సూచించారు. బస్సు బయలుదేరే సమయంలో అల్పాహారం అందించనున్నారు. 69 వేల మంది కోసం కేటరింగ్‌ సంస్థలు టమాటా బాత్‌తోపాటు వాటర్‌ బాటిల్స్‌, అరటిపండు, బిస్కెట్‌ ప్యాకెట్‌తో కూడిన ప్యాక్‌లు సిద్ధం చేస్తున్నాయి. జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్‌ నేతృత్వంలో చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, రేషన్‌ డీలర్లు కేటరింగ్‌ సంస్థలను పర్యవేక్షిస్తున్నారు. కాగా జనాల తరలింపు, బస్సులపై పర్యవేక్షణకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. జిల్లా స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు అధికారి ఆర్‌.పూర్ణిమాదేవి నేతృత్వంలో సుమారు 400 మంది సిబ్బంది కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రెండు షిఫ్ట్‌లలో వీరు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనిచేస్తుందని పూర్ణిమాదేవి తెలిపారు. ప్రతి బస్సు డ్రైవర్‌, ఇన్‌చార్జి ఫోన్‌ నంబర్లతో కూడిన సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న సిబ్బందికి అందజేశారు. కాగా ప్రధాని సభకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు పాస్‌లను పంపిణీ చేశారు.

Updated Date - Aug 01 , 2026 | 01:09 AM