Share News

ఛేంజర్‌గా భోగాపురం విమానాశ్రయం

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:18 AM

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యాక ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని వీఎంఆర్‌డీఐ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌భరత్‌ పేర్కొన్నారు.

ఛేంజర్‌గా భోగాపురం విమానాశ్రయం

గేమ్‌ మారనన్న ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం

అందుబాటులోకి కనెక్టివిటీ రహదారులు

వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌ భరత్‌

విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యాక ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని వీఎంఆర్‌డీఐ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌భరత్‌ పేర్కొన్నారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విమానాశ్రయం గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు. విమానాశ్రయం పరిసరాల్లో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. యువతకు విమానయానం, సరకు రవాణా, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రణవ్‌ గోపాల్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరం నలు మూలల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రధాన రహదారులను విస్తరించడంతో వీఎంఆర్‌డీఏ కీలకపాత్ర పోషించిందన్నారు. మొత్తం 15 రహదారులను విస్తరించాలని నిర్ణయించామని, అందులో ప్రధానమైన ఏడు రహదారుల పనులను రూ.175 కోట్లతో చేపట్టామన్నారు. వీఎంఆర్‌డీఏ నేతృత్వంలో 28 కి.మీ.మేర రహదారులను విస్తరించామన్నారు. వీటిలో 4 కి.మీ. మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయన్నారు. తిమ్మాపురం-మారికవలస రహదారి (6.3 కి.మీ.)ని 30 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా విస్తరించామన్నారు. అడవివరం-శొంఠ్యాం రహదారి (8 కి.మీ.)ని 30 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లుగా విస్తరించామన్నారు. అక్కడ ఇంకో 4 కి.మీ. మార్గం వేయాల్సి ఉందన్నారు. నేరెళ్లవలస-కొత్తవలస (3.9 కి.మీ.) రహదారిని 30, 24 మీటర్ల వెడల్పుతో విస్తరించామన్నారు. బోయపాలెం-కాపులుప్పాడ రహదారి (3.1 కి.మీ.)ని 24 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా విస్తరించామన్నారు. భీమిలి-దొరతోట రహదారి (6.02 కి.మీ.) పనులు ఆర్‌ అండ్‌ బి శాఖ చేపడుతున్నదన్నారు. వేపగుంట-పినగాడి ప్రధాన రహదారి (3.2 కి.మీ) విస్తర్ణ పనులు వీఎంఆర్‌డీఏ చేపట్టిందని, 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వేపగుంట-జుత్తాడ రహదారి పనులు జీవీఎంసీ చూస్తోందన్నారు.

ఎక్కడికక్కడ సూచికలు

కమిషనర్‌ తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ ప్రధాన రహదారులు జాతీయ రహదారిని కలిసే జంక్షన్లను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఎక్కడికక్కడ సూచికలు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గాలను గుర్తించి, గూగుల్‌ మ్యాప్‌ సంస్థకు ఇచ్చామని, వారు కూడా వాటిని ఇంటిగ్రేట్‌ చేస్తారన్నారు. బీచ్‌ రోడ్డులో కోస్టల్‌ కారిడార్‌ పనులు త్వరలో నేషనల్‌ హైవే అథారిటీ చేపట్టనుందన్నారు. ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజనీర్‌ వినయకుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


డాక్యుమెంట్‌ రైటర్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు

విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేకుండా నేరుగా కక్షిదారులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చునని ద్వారకానగర్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ డి.వి.నారాయణ, సూపర్‌బజారు జాయింట్‌-1 అధికారిణి జె.కనకరత్నం, జాయింట్‌-2 కె.రామశ్రీను తెలిపారు. వారు సంయుక్తంగా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్యుమెంట్‌ రైటర్ల సమ్మె వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని చాలామంది భావిస్తున్నారని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో వారికి సంబంధం లేదని స్పష్టంచేశారు. ప్రతి కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఉందని, రిజిస్ట్రేషన్‌ చేయించుకోదలచిన వారు అక్కడికి అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోలతో వస్తే సిబ్బంది అన్నీ దగ్గరుండి చేయిస్తారని వివరించారు. పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానంలో ఎవరి డాక్యుమెంట్‌ వారే తయారు చేసుకోవచ్చునని, దీనికి సిబ్బంది సహకారం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల వల్ల తమ ఉపాధి పోతుందనే భయంతో డాక్యుమెంట్‌ రైటర్లు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం హామీ ఇచ్చినా వారు మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ వ్యవస్థ లేకుండా నేరుగా పనులు చేసుకునే అవకాశం అందుబాటులో ఉన్నందున అంతా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Updated Date - Jul 26 , 2026 | 01:18 AM