భోగాపురం... కానరాని మార్గం!
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:43 AM
భోగాపురంలో కొత్త విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇంకో నెల రోజులు మాత్రమే గడువు ఉంది.
వచ్చే నెల మొదటివారంలో విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు
సిటీ నుంచి ప్రయాణ సమయం 2 గంటలు
నగరం నుంచి అక్కడకు చేరడం కత్తిమీద సామే
ప్రయాణికుల ఆందోళన
ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతామంటున్న ఆర్టీసీ
సమస్య పరిష్కారమయ్యేనా?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భోగాపురంలో కొత్త విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇంకో నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా విశాఖ నుంచి ప్రయాణికులు అక్కడకు చేరడానికి అవసరమైన మౌలిక వసతులన్నీ సమకూర్చాల్సి ఉంది. విమాన ప్రయాణం కంటే ముందు విశాఖ నుంచి భోగాపురం వెళ్లడమే ఒక ప్రహసనం అని అంతా ఆందోళన చెందుతున్నారు. దీనికి అధికార యంత్రాంగం సరైన పరిష్కారం చూపలేకపోతోంది. ఇంకా అధ్యయనం చేస్తున్నామని, కమిటీలు వేశామని చెబుతోంది.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం జూలై మొదటి వారంలో ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే వెంటనే విశాఖపట్నంలో విమానాశ్రయం మూసివేస్తారు. అంటే ఎవరైనా భోగాపురం వెళ్లాల్సిందే. అనకాపల్లి, పరవాడ, గాజువాక పారిశ్రామిక ప్రాంతాలతో పాటు విశాఖ నుంచి ఎవరైనా భోగాపురం వెళ్లాలంటే...సుమారు 60 కి.మీ. ప్రయాణం చేయాలి. సిటీ మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారిపై ప్రయాణిస్తే ఇప్పుడున్న ట్రాఫిక్‌లో గాజువాక నుంచి భోగాపురం వెళ్లేందుకు రెండు గంటల సమయం పడుతోంది. అదే నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే గంటన్నర పడుతోంది. విమానాశ్రయానికి రోజూ పది వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరంతా ఇకపై జాతీయ రహదారిపై భోగాపురం వైపు ప్రయాణిస్తే ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. అంటే ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది.
మాస్టర్ ప్లాన్ రహదారుల ఉపయోగం అంతంతమాత్రమే
భోగాపురం విమానాశ్రయం రహదారిని అనుసంధానిస్తూ వీఎంఆర్‌డీఏ ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టింది. వీటిలో మూడు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో విమాన ప్రయాణికులకు ఉపయోగపడే మార్గాలు కేవలం రెండే. ఒకటి అడివివరం నుంచి శొంఠ్యాం వరకు నిర్మిస్తున్న మార్గం కాగా మరొకటి పినగాడి, వేపగుంటలను కలుపుతూ నిర్మిస్తున్న మరో మార్గం. ఈ రెండు మార్గాల్లో ప్రయాణించేవారు శొంఠ్యాం దగ్గర అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపైకి చేరుకుంటే ఆనందపురం మీదుగా భోగాపురం వెళ్లడానికి వీలవుతుంది. అంటే అనకాపల్లి, గాజువాక పరిసర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఈ మార్గాలు ఉపకరిస్తాయి. వారికి కూడా వేపగుంట జంక్షన్, సింహాచలం, అడవివరం జంక్షన్‌లలో ట్రాఫిక్ సమస్యలు తప్పవు.
విశాఖ నుంచి భోగాపురం వరకు కోస్టల్ కారిడార్ నిర్మాణం ప్రతిపాదన ఉంది. ఇది ఇంకా డీపీఆర్ దశలోనే ఉంది. ఇది పూర్తి కావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుంది. కాబట్టి దీనిపై ఎవరికీ ఆశలు లేవు.
నగరం నుంచి వెళ్లేవారికి మార్గాలు ఏవీ..?
విశాఖ నగరం నుంచి భోగాపురం వెళ్లేవారు జాతీయ రహదారి ట్రాఫిక్‌ను తప్పించుకోవాలంటే...వారు కూడా హనుమంతవాక జంక్షన్ నుంచి హెల్త్‌సిటీ వీదుగా అడివివరం జంక్షన్‌కు చేరుకొని, శొంఠ్యాం మార్గంలో ఆనందపురం హైవే పైకి వెళ్లాల్సి ఉంది. అప్పుడు హనుమంతవాక-అడివరం బీఆర్‌టీఎస్ మార్గంలో ట్రాఫిక్ పెరుగుతుంది. ఇది కొందరికే ఉపయోగపడుతుంది.
సిటీలో జాతీయ రహదారిపై మద్దిలపాలెం- ఇసుకతోట-హనుమంతవాక-ఎండాడ-పీఎంపాలెం-కొమ్మాది-బోయపాలెం-ఆనందపురం మీదుగా భోగాపురం వెళ్లాలనుకుంటే కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈ మార్గంలో కొత్తగా చేసిన ఏర్పాట్లు ఏమీ లేవు. ఈ మార్గంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరుచేసినా మెట్రో రైలు ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేపట్టడానికి అంగీకరించడం లేదు. ఇదే పెద్ద సమస్యగా పరిణమించింది.
ఎలక్ర్టిక్ బస్సుల్లో ఎక్కే అవకాశం ఉందా?
భోగాపురం విమానాశ్రయానికి గాజువాక, కూర్మన్నపాలెం, సిటీలో పలు ప్రాంతాల నుంచి 20 ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది. దీనిపై రూట్ సర్వే కూడా చేసింది. అవసరమైతే బీచ్ రోడ్డులో కూడా ఈ-బస్సులు తిప్పుతామని పేర్కొంది. అయితే విమానం ఎక్కడానికి వేల రూపాయల టికెట్ తీసుకునే ప్రయాణికులు ఈ-బస్సులను ఎక్కడానికి బస్టాప్‌లో సూట్‌కేసులు పట్టుకొని నిల్చొంటారా?...అనే విషయం అధికారులు ఆలోచించడం లేదు.
- విమాన ప్రయాణం చేసేవారు రెండు లేదా అంతకంటే ఎక్కువ సూట్‌కేసులతో వెళతారు. వాటిని ఎలక్ర్టిక్ బస్సుల్లో తీసుకువెళ్లేంత స్థలం ఏర్పాట్లు ఉన్నాయా? ఉంటాయా? అని పలువరు ప్రశ్నిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్‌లో సరైన సమయానికి చేరగలమా? అనేది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. విమానాశ్రయం చేరడానికే రెండు గంటల సమయం పడితే ఎలా?...అనేది ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్న మాట.
ఆనందపురం హైవే ఎక్కితే పావు గంటే
వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం
భోగాపురం వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుందని అంతా అంటున్నారు. హనుమంతవాక నుంచి అడివవరం మీదుగా ఆనందపురం హైవే ఎక్కితే భోగాపురం పావుగంటలో వెళ్లిపోవచ్చు. అవన్నీ తెలిసీ తెలియని మాటలు.
మాస్టర్ ప్లాన్ రహదారులను పూర్తి చేస్తున్నాం
శ్రీభరత్, విశాఖ ఎంపీ
భోగాపురం విమానాశ్రయం చేరడానికి ఇప్పుడు గంట్నర సమయం పడుతోంది. దీనిని 45 నుంచి 50 నిమిషాలకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేస్తున్నాం.
లాంజ్‌లు నిర్మించే ఆలోచన లేదా?
భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారికి ప్రత్యేకంగా నగరంలో ఐదారుచోట్ల ఏసీ సదుపాయంతో లాంజ్‌లు ఏర్పాటు
చేయాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ఇప్పటికే రెండు, మూడు సార్లు కోరింది. వాటిలో కూర్చొనే సదుపాయంతో పాటు, ఏటీఎంలు, మెడికల్ షాపు, క్యాంటీన్ సదుపాయం కల్పించాలని కోరింది. ఈ-బస్సులు అక్కడకే వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరింది. దీనిపై జిల్లా యంత్రాంగం నోరు విప్పడం లేదు. ప్రజా ప్రతినిధులు కూడా చొరవ చూపడం లేదు.