భోగాపురం... ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:56 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కానుంది.
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో వీఈఆర్ వేగవంతం
ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు
యువతకు భారీగా ఉపాధి అవకాశాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కానుంది. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయం 17వ తేదీ నుంచి వాణిజ్య కార్యకలాపాలకు శ్రీకారం చుడుతుంది. ఇది కేవలం ప్రయాణికుల రాకపోకలకే మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫార్మా, ఆక్వా, దుస్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర ఉత్పత్తుల రవాణాకు కార్గో సేవలు కూడా అందిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో వివిధ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒబెరాయ్, మైరా వంటి సంస్థలు తీర ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణానికి సిద్ధమయ్యాయి. రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ప్రతిపాదించిన ‘విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)’ లక్ష్య సాధనకు ఈ విమానాశ్రయం కీలకం కానుంది. ఇక జీఎంఆర్ సంస్థ మాన్సాస్ ట్రస్టుతో కలిసి విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషన్ (ఎంఆర్‌ఓ) కేంద్రం ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు సముద్రం, మరోవైపు విమానాశ్రయం, రెండింటినీ కలుపుతూ జాతీయ రహదారి ఉండడంతో లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ పరిశ్రమల రాకకు మార్గం సుగమం అవుతుంది. ఆనందపురం మండలం తర్లువాడలో ఇప్పటికే సెమీ కండక్టర్ల తయారీకి ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ ముందుకువచ్చింది. ఇలాంటివి ఇంకా అనేకం వచ్చే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు, గ్లోబల్ కేపబులిటి సెంటర్ల ఏర్పాటుకు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అనువుగా ఉంటుంది. భారీ పరిశ్రమల రాకతో చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా పుట్టుకొస్తాయి. వాటితో ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
ప్రజలను భాగస్వాములను చేయాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్
31న ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ
విద్యార్థులకు ‘మై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్’ థీమ్‌తో పోటీల నిర్వహణ
సిరిపురం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సూచించారు. ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్న విస్తృతస్థాయి ప్రజా సంప్రతింపుల ప్రచారంపై సంబంధిత అధికారులతో సోమవారం తన ఛాంబర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే కాకుండా, రాష్ర్టాన్ని ప్రపంచస్థాయి పెట్టుబడులకు, స్థిరమైన అభివృద్ధికి కేంద్రంగా మారుస్తుందన్నారు. విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జూలై 31న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. ‘మై డిస్ర్టిక్స్ టేక్స్ ఆఫ్’ థీమ్‌తో పాఠశాల స్థాయిలో వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయి విజేతలకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు. పద్మనాభం మండలం పాండ్రంగి, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారకార్థం జానపద నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. భోగాపురం థీమ్‌తో క్రికెట్, బీచ్ వాలీబాల్ టోర్నమెంట్లు, విద్యార్థుల ఫ్లాష్‌మాబ్‌లు, భారీ స్థాయిలో రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నామని, వీటిలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
నగరంలో ఈ నెల 30, 31 తేదీల్లో ఐటీ, జీసీసీ కంపెనీల భాగస్వామ్యంతో భారీ ఆపర్చ్యూనిటీ హబ్ కెరీర్ ఎక్స్‌పో, ఆర్‌కే బీచ్‌లో 5కే రన్, డ్రోన్ షో, ప్రౌడ్లీ వైజాగ్ బీచ్ వాక్ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయా శాఖల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, ఆర్టీసీ డీఎం అప్పలనాయుడు, డీఎస్‌వో భాస్కరరావు, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.