Share News

వైసీపీకి భీమిలి ఇన్‌చార్జి చిన్న శ్రీను గుడ్‌బై

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:23 AM

వైసీపీకి ఆ పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గుడ్‌బై చెప్పారు.

వైసీపీకి భీమిలి ఇన్‌చార్జి చిన్న శ్రీను గుడ్‌బై

టీడీపీలో చేరిక

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

వైసీపీకి ఆ పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గుడ్‌బై చెప్పారు. విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను తనకుమార్తె సిరిసహస్రతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం టీడీపీలో చేరారు. 2024 సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత భీమిలి సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చిన్న శ్రీనుకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ వచ్చారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న చిన్న శ్రీను మంగళవారం సాయంత్రం హఠాత్తుగా వైసీపీకి, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ జిల్లా సాధారణ సమావేశం బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా చిన్న శ్రీను రాజీనామా చేయడం నేతల్లో కలవరం రేపింది. చిన్న శ్రీనుతోపాటు భీమిలి నియోజకవర్గం నుంచి మరికొందరు నేతలు టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పుడు భీమిలి సమన్వయకర్తగా ఎవరిని నియమిస్తారనే దానిపై పార్టీ నేతలు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.


1,62,407

ఇదీ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య

బీసీ ఓటర్లు 1,26,444

ఎస్సీలు 13,867, ఎస్టీలు 1,068

ఇతరులు 21,028...

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని నాలుగు మండలాల్లో గల 79 గ్రామ పంచాయతీల పరిధిలోని ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 1,62,407 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు. వీరిలో బీసీ ఓటర్లు 1,26,444 మంది, ఎస్సీ ఓటర్లు 13,867 మంది, ఎస్టీ ఓటర్లు 1,068 మంది ఉండగా, ఇతరులు 21,028 మంది ఉన్నారు. ఆనందపురం మండలంలో మొత్తం ఓటర్లు 51,951 మంది ఉండగా, వారిలో బీసీలు 42,240, ఎస్సీలు 4,432, ఎస్టీలు 812, ఇతరులు 4,467 మంది ఉన్నారు. భీమిలి మండలంలో మొత్తం 36,943 మంది ఓటర్లు ఉండగా, వీరిలో బీసీలు 24,116 మంది, ఎస్సీలు 2,652 మంది, ఎస్టీలు నలుగురు, ఇతరులు 10,171 మంది ఉన్నారు. పద్మనాభం మండలంలో మొత్తం 42,388 మంది ఓటర్లు ఉండగా, బీసీలు 32,705 మంది, ఎస్సీలు 2,373 మంది, ఎస్టీలు 103 మంది, ఇతరులు 4,876 మంది ఉన్నారు. పెందుర్తి మండలంలో మొత్తం ఓటర్లు 31,125 మంది ఉండగా, బీసీలు 27,383 మంది, ఎస్సీలు 2,175 మంది, ఎస్టీలు 53 మంది, ఇతరులు 1,514 మంది ఉన్నారు. జిల్లాలో ఎస్సీ ఓటర్లు ఎక్కువగా గండిగుండం, పేకేరు, బాందేవుపురం, కొవ్వాడ, పొట్నూరు పంచాయతీల్లో ఎక్కువగా ఉన్నారు. ఎస్టీ ఓటర్లు కుసులువాడ, భీమన్నదొరపాలెం, మావిడిలోవ, ముచ్చర్లలో ఉన్నారు.


ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

ఉమ్మడి జిల్లాలో 2,000 మంది...

పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌

ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

వైద్య, ఆరోగ్య శాఖలో గడిచిన పది హేనేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. విజయవాడలో నెలన్నర కిందట భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉద్యోగులు...అప్పటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈ నెలాఖరు వరకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని, అప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, విధులను బహిష్క రిస్తామని హెచ్చరిస్తున్నారు.

సుమారు రెండు వేల మంది ఉద్యోగులు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు రెండు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు 2011 నుంచి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీ షియన్లు, ఫార్మసిస్టులు, రేడియాలజీ టెక్నీ షియన్లు, క్యాథలాబ్‌ టెక్నీషియన్లు, డయా లసిస్‌ టెక్నీషియన్లు, డెంటల్‌ టెక్నీషియన్లు, న్యూరో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు.

ఇవీ డిమాండ్లు

దశాబ్ద కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే, వంద శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని, రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా సెలవులు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదు పాయం కల్పించాలని, డెత్‌ బెనిఫిట్స్‌ కింద ఎక్స్‌గ్రేషియా కనీసం ఐదు లక్షలు చెల్లించాలని, మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు అవకాశం కల్పించా లన్న డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని జేఏసీ చైర్మన్‌ ఆశ, కన్వీనర్‌ ఎం.కిశోర్‌ కోరారు.


కిశోరి వికాసం..పరిహాసం

11 నుంచి 18 ఏళ్ల మధ్య బాలికల కోసం ప్రత్యేకంగా రూపకల్పన

విద్య, ఆరోగ్యంతో పాటు అన్నింటిపైనా అవగాహన కల్పించేలా కార్యక్రమాల రూపకల్పన

అమలులో వైఫల్యం

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

బాలికల సమగ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘కిశోరి వికాసం’ పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 11 నుంచి 18 ఏళ్ల మధ్య గల బాలికల సర్వతోముఖాభివృద్ధి, రక్షణ, సాధికారత కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భిన్నమైన కార్యక్రమాలను రూపొందించి, నిర్వహించాల్సిన బాధ్యతను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. అయితే అధికారులు కేవలం వేసవి ప్రత్యేక శిబిరాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇతర కార్యక్రమాలపై మాత్రం శ్రద్ధ వహించడం లేదు.

అమలు ఎక్కడ?

బాలికలు ఆరోగ్యకరంగా, ఆత్మవిశ్వాసంతో పెరిగేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత, రుతుక్రమ పరిశుభ్రత, పౌష్టికాహారం, పోక్సో, ఆర్థిక అక్షరాస్యత, భద్రత, బ్యాంకు ఖాతా నిర్వహణ, పొదుపు అలవాట్లు, ఆర్థిక సాక్షరతా, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా సోషల్‌ మీడియా ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్‌ భద్రత, లైంగిక, పునరుత్పత్తి అంశాలపై అవగాహన కల్పించాలి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆ ఊసే లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాలికల వికాసానికి దోహదం చేసే కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Sep 09 , 2026 | 12:23 AM