భానుడి భగభగలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:28 AM
భానుడి భగభగలతో జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులతో మలమలమాడిపోయారు. ఆకాశం నిర్మలంగా వుండడంతో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ చుర్రుమనిపించింది.
వడగాడ్పులతో బెంబేలెత్తిన ప్రజలు
21 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి నమోదు
మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఐదు డిగ్రీలకు పైగా పెరిగిన ఉష్ణోగత్రలు
అనకాపల్లి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలతో జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులతో మలమలమాడిపోయారు. ఆకాశం నిర్మలంగా వుండడంతో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ చుర్రుమనిపించింది. తొమ్మిది గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్ర వడగాడ్పులు వీచాయి. వేడి వాతావరణానికితోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలో 24 మండలాలకుగాను అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి మినహా మిగిలిన 21 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేవరాపల్లి మండలంలో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాలను పరిశీలిస్తే.. అనకాపల్లిలో 40.9, బుచ్చెయ్యపేటలో 42.1, చీడికాడలో 42.5, చోడవరంలో 42.4, గొలుగొండలో 41.4, కె.కోటపాడులో 40.4, కశింకోటలో 42, కోటవురట్లలో 40.8, మాడుగులలో 41.9, మాకవరపాలెంలో 42.7, మునగపాకలో 40.4, నర్సీపట్నంలో 42.4, నాతవరంలో 40.7, పరవాడలో 41.5, పాయకరావుపేటలో 40.8, రావికమతంలో 41.7, రోలుగుంటలో 41, ఎస్.రాయవరంలో 40, సబ్బవరంలో 41.5, ఎలమంచిలిలో 41.1, నక్కపల్లిలో 39.5, అచ్యుతాపురంలో 37.5, రాంబిల్లిలో 37.5, డిగ్రీలు నమోదయ్యాయి.