భానుడి భగభగలు
ABN , Publish Date - May 25 , 2026 | 12:10 AM
భానుడి భగభగలతో జిల్లావాసులు అల్లాడిపోయారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. క్రమేపీ ఎండ తీవ్రత పెరగడంతోపాటు వడగాడ్పులు మొదలయ్యాయి. పది గంటల తరువాత పరిస్థితి తీవ్రంగా మారింది. రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. అధిక ఎండకుతోడు ఉక్కపోతతో ఇళ్లల్లో ఉన్న వారు సైతం చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో దాదాపు సగం మండలాల్లో వరుసగా ఐదో రోజు కూడా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గం నిప్పుల కొలిమిలా మారింది. నర్సీపట్నంలో రికార్డుస్థాయిలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.
అధిక వేడి, వడగాడ్పులతో అల్లాడిన ప్రజలు
ఉక్కపోతతో తడిసిముద్ద..
నర్సీపట్నంలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
వడదెబ్బకు ఇద్దరి మృతి
అనకాపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలతో జిల్లావాసులు అల్లాడిపోయారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. క్రమేపీ ఎండ తీవ్రత పెరగడంతోపాటు వడగాడ్పులు మొదలయ్యాయి. పది గంటల తరువాత పరిస్థితి తీవ్రంగా మారింది. రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. అధిక ఎండకుతోడు ఉక్కపోతతో ఇళ్లల్లో ఉన్న వారు సైతం చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో దాదాపు సగం మండలాల్లో వరుసగా ఐదో రోజు కూడా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గం నిప్పుల కొలిమిలా మారింది. నర్సీపట్నంలో రికార్డుస్థాయిలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. మిగిలిన మండలాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మాకవరపాలెంలో 44.3, గొలుగొండలో 42.8, రావికమతంలో 42.7, రోలుగుంటలో 42.7, నాతవరంలో 41.7, చీడికాడలో 41.7, దేవరాపల్లిలో 41.5, కశింకోటలో 41.4, కోటవురట్లలో 41.1, మాడుగులలో 40.9, బుచ్చెయ్యపేటలో 39.8, చోడవరంలో 39.2, కె.కోటపాడులో 39.2, ఎస్.రాయవరంలో 38.9, పరవాడలో 38.8, సబ్బవరంలో 38.8, పాయకరావుపేటలో 38.7, మునగపాకలో 38.6, అనకాపల్లిలో 37.8, ఎలమంచిలిలో 37.4, నక్కపల్లిలో 37.4, రాంబిల్లిలో 36.5, అచ్యుతాపురంలో 35.8 డిగ్రీలు నమోదయ్యాయి.
వడదెబ్బకు ఇద్దరి మృతి
బుచ్చెయ్యపేట/ రావికమతం, మే 24 (ఆంధ్ర జ్యోతి): వడదెబ్బ ప్రభావంతో బుచ్చెయ్యపేట మండలంలో ఆటో డ్రైవర్, రావికమతం మండలంలో వృద్ధురాలు మృతిచెందారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన సయ్యపురెడ్డి కొండబాబు (50) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం వడ్డాది జంక్షన్‌కు ఆటో తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఆటోలో స్పృహతప్పి పడిపోవడాన్ని గుర్తించిన సహచర ఆటో డ్రైవర్లు సపరిచర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. కొండబాబుకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు వున్నారు.
కాగా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన పాసపు సత్యవతి (66) వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందింది. మూడు రోజుల నుంచి కాస్తున్న తీవ్ర ఎండల కారణంగా నీరసించిపోయిందని, ఉపశమన చర్యలు చేపట్టినా పరిస్థితి మెరుగుపడలేదని, దీంతో ఆదివారం ఇంటివద్దనే మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా శనివారం కేబీపీ అగ్రహారానికి చెందిన దివ్యాంగ యువకుడు వడదెబ్బకు గురై మృతిచెందిన విషయం తెలిసిందే.