అంతకు మించి..
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:02 AM
ఎలమంచిలి మునిసిపాలిటీలో ఓటర్ల విషయంలోనే కాదు.. పరిపాలనలో కూడా మహిళలదే పైచేయిగా వుంది. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం వార్డుల్లో సగం స్థానాలను మహిళలకు రిజర్వు చేయగా, వాటికన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాక మునిసిపల్ చైర్పర్సన్ పదవిని వరుసగా మూడు పర్యాయాలు ఒక మహిళ.. అందునా ఒకే వ్యక్తి ఎన్నిక కావడం విశేషం.
ఎలమంచిలి కౌన్సిలర్లలో 60 శాతం మంది మహిళలే
32 వార్డులకుగాను 19 వార్డులు మగువలే ప్రజాప్రతినిధులు
జనసేన- ఏడుగురు, టీడీపీ- ఐదుగురు, వైసీపీ- నలుగురు, బీజేపీ- ఇద్దరు, ఒక ఇండిపెండెంట్
అన్‌రిజర్వుడ్ స్థానాల్లోనూ సత్తాచాటిన మహిళలు
ఎలమంచిలి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపాలిటీలో ఓటర్ల విషయంలోనే కాదు.. పరిపాలనలో కూడా మహిళలదే పైచేయిగా వుంది. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం వార్డుల్లో సగం స్థానాలను మహిళలకు రిజర్వు చేయగా, వాటికన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాక మునిసిపల్ చైర్పర్సన్ పదవిని వరుసగా మూడు పర్యాయాలు ఒక మహిళ.. అందునా ఒకే వ్యక్తి ఎన్నిక కావడం విశేషం.
చరిత్రలో మహిళలే మహారాణులుగా ఈ ఎన్నికల్లో గెలుపొంది రానున్న నూతన పాలకవర్గంలో పాలు పంచుకోనున్నారు. మునిసిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ 3 సార్లు చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి మాత్రమే ఖ్యాతి నార్జించింది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం 32 కౌన్సిల్ స్దానాల్లో 19 మంది మహిళలు గెలుపొంది మునిసిపాలిటీ పాలించబోతున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎలమంచిలి మునిసిపల్ ఎన్నికల్లో సార్దకమైనట్లు అనిపిస్తుంది. మునిసిపల్ ఓటర్లలోనూ అధికస్దానంలో ఉండడమే కాకుండా పోలింగ్ శాతంలోనూ మహిళలే అధికంగా ఓటు వేయడం మరో విశేషం.
మునిసిపాలిటీలో మొత్తం 36,526 మంది ఓటర్లు వున్నారు. వీరిలో పురుషులు 17,450 మంది, మహిళలు 19,068 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 1,618 మంది అధికంగా ఉన్నారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పురుషులు 13,090 మంది, మహిళలు 14,789 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కన్నా 1,699 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. చైర్పర్సన్ పదవిని అన్‌రిజర్వుడ్ మహిళలకు కేటాయించారు. మొత్తం 32 వార్డులకుగాను 16 వార్డులను మహిళలకు కేటాయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ 16 వార్డులతోపాటు మరో మూడు వార్డుల్లో మహిళలు విజేతలుగా నిలిచారు. దీంతో కౌన్సిల్లోమహిళా కౌన్సిలర్ల బలం19కి చేరింది. చైర్‌పర్సన్‌తో కలుసుకుంటే మొత్తం 20 మంది మహిళలే!
చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి వరుసగా మూడోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మునిసిపాలిటీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఆమె చైర్పర్సన్ కావడం ఒక రికార్డుగా చెప్పాలి. మొదటిసారి టీడీపీ, రెండోసారి వైసీపీ, ఈసారి బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే.. ఏడుచోట్ల జనసేన, ఐదుచోట్ల టీడీపీ, నాలుగు వార్డుల్లో వైసీపీ, రెండువార్డుల్లో బీజేపీ, ఒక వార్డులో ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. 1వ వార్డు కర్రి ఝాన్సీ (జనసేన), 3 వార్డు పండూరి నాగశేషు కుమారి (వైసీపీ), 4వ వార్డు లీలా బోజా (జనసేన), 8వ వార్డు ఆడారి భాగ్యశ్రీ (టీడీపీ), 9వ వార్డు ఆడారి సునీత (టీడీపీ), 10వ వార్డు యల్లపు లీలావతి (బీజేపీ), 11వ వార్డు దేవ నాగమణి (టీడీపీ), 12వ వార్డు అత్తిలి సత్యవతి (ఇండిపెండెంట్), 13వ వార్డు సీరా సాయి ప్రసన్న (బీజేపీ), 14వ వార్డు కొఠారు లక్ష్మి (టీడీపీ), 15వ వార్డు బీముని భాగ్యలక్ష్మి (జనసేన), 17వ వార్డు పిట్టా నాగమణి (జనసేన), 19వ వార్డు లంక జయలక్ష్మి (జనసేన), 20వ వార్డు కట్టమూరు సుజాత (వైసీపీ), 25వ వార్డు కొఠారు రజని (జనసేన), 27వ వారు దంట్ల వెంకట లావణ్య (టీడీపీ), 28వ వార్డు కోడిగుడ్డు రాజేశ్వరి (వైసీపీ), 31వ వార్డు పాలరౌతు వెంకటలక్ష్మి (వైసీపీ), 32వ వార్డు బెజవాడ పుష్ప వెంకట మణి (జనసేన) కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అన్‌రిజర్వుడ్ జనరల్‌లో వున్న 1, 3, 32 వార్డుల్లో మహిళలు విజయం సాధించడం విశేషం.