Share News

పందెంరాయుళ్లు సై

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:55 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట, బల్లాట వంటి పలురకాల జూద క్రీడలు నిర్వహించేందుకు చాపకింద నీరులా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ పేరుతో రాజకీయ పార్టీల నేతలే కోడిపందేలను ప్రోత్సహిస్తున్నారు. కానీ పోలీసు అధికారులు మాత్రం ఎక్కడికక్కడ డ్రోన్లతో నిఘా పెట్టామని, జూదాలు నిర్వహించేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

పందెంరాయుళ్లు సై
తిమ్మాపురంలో మంగళవారం మధ్యాహ్నం టెంట్లను విప్పిస్తున్న ఎస్‌ఐ విభీషణరావు

సంక్రాంతి పండుగ ముసుగులో జూద క్రీడలకు రంగం సిద్ధం

కోడిపందేలు, పేకాట, గుండాలకు చాపకింద నీరులా ఏర్పాట్లు

రహస్యంగా బరులను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు

డ్రోన్లతో నిఘా పెట్టి, కఠినంగా వ్యవహరిస్తామంటున్న పోలీసులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట, బల్లాట వంటి పలురకాల జూద క్రీడలు నిర్వహించేందుకు చాపకింద నీరులా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ పేరుతో రాజకీయ పార్టీల నేతలే కోడిపందేలను ప్రోత్సహిస్తున్నారు. కానీ పోలీసు అధికారులు మాత్రం ఎక్కడికక్కడ డ్రోన్లతో నిఘా పెట్టామని, జూదాలు నిర్వహించేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.

సంక్రాంతి పండుగ సమయంలో గ్రామాల శివారు ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూదాలు నిర్వహించడం సర్వసాధారణం. పోలీసుల కళ్లుగప్పి గ్రామాలకు దూరంగా రహదారి సదుపాయం లేనిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా వీటిని నిర్వహిస్తుంటారు. ఒకవేళ పోలీసులకు సమాచారం అంది.. దాడులకు వస్తున్నట్టు తెలిస్తే.. సులువుగా తప్పించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసారి కూడా అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 15 ప్రదేశాల్లో వివిధ రకాల జూదాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరుతో ఆయా ప్రదేశాల్లో ఇప్పటికే టెంట్లు వేశారు. ముగ్గులు, వంటలు, క్రీడా పోటీలు, సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ పేరుతో ఏర్పాట్లు చేస్తున్న ఈ ప్రదేశాల వద్ద గురువారం మధ్యాహ్నం తరువాత నుంచి కోడిపందేలు, గుండాట వంటి జూదాలు జోరుగా సాగుతాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా వుండేందుకు స్థానిక నేతలు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.

శివారు ప్రాంతాల్లో పేకాట

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల శివారుల్లోని మామిడి, కొబ్బరి తోటలు, పొలాల్లో పేకాట ఆడడం సహజం. జూదరులు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకొని పేకాటల జరిగే ప్రదేశాలను ఎప్పటికప్పుడు వాట్సాప్‌, ఫోన్‌ల ద్వారా సమాచారం చేరవేస్తుంటారు. అనుకున్న సమయానికి అందరూ అక్కడకు చేరి పేకాట మొదలుపెడతారు. ఒకవేళ పోలీసులకు ఈ విషయం తెలిసి, అక్కడకు వస్తున్నట్టు సమాచారం అందితే.. వెంటనే పేకాట శిబిరాన్ని మార్చేస్తారు. ఇందుకోసం పేకాట ఆడే ప్రదేశానికి కొంతదూరంలో మొబైల్‌ ఫోన్లతో తమ మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈసారి పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో కోడిపందేలు, పేకాట ఆడేవారిని పట్టుకోవడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆయా ప్రదేశాలకు వేగంగా చేరుకొని, జూదరులను చుట్టుముట్టి పట్టుకుంటారు. ఒకవేళ పారిపోతుంటే ఫొటోలు, వీడియోల ద్వారా మనుషులను, వారి వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తారు.

జూదాల కట్టడికి డ్రోన్‌ కెమెరాలతో నిఘా

ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ముసుగులో జరిగే కోడి పందేలు, పేకాట, గుండాట వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, అన్ని మండలాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగుతుందని ఎస్పీ తుహిన్‌ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూదాలకు అవకాశం ఉన్న మారుమూల ప్రాంతాల్లో పొలాలు, తోటలపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. కోడిపుంజులకు కత్తులుకట్టి పందేలు నిర్వహించడం, బెట్టింగులు కాయడం చట్టరీత్యా నేరమన్నారు. అసాంఘిక కార్యకలాలు నిర్వహించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, సంప్రదాయం పేరుతో జీవహింసకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే రౌడీషీట్‌లు తెరిచేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మీ చుట్టుపక్క ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే 100, 112 నంబర్లకు లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.

పోలీసుల హెచ్చరికలు బేఖాతరు

తిమ్మాపురంలో వెనక్కుతగ్గని కోడిపందేల నిర్వాహకులు

టెంట్ల తొలగింపులో డ్రామా

ఎస్‌.రాయవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాట, గుండాటలపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసుల హెచ్చరికలు ఉత్తుత్తివే అని మరోసారి రుజువైంది. ఇందుకు ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురంలో కొనసాగులతున్న ఏర్పాట్లే ఒక ఉదాహరణ. తిమ్మాపురంలోని హెటెరో కాలనీకి సమీపంలో ఉన్న ఒక ఖాళీ స్థలంలో గ్రామానికి చెందిన కొంతమంది కూటమి నాయకులు కోడి పందేలు, గుండాటలు ఆడించడం కోసం ఈ నెల 11వ తేదీన టెంట్లు వేయడం ప్రారంభించారు. దీనిపై ఫొటోలతోసహా సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే తొలగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అయితే కూటమి నేతల నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయో తెలియదుగానీ.. సోమవారం రాత్రి వరకు టెంట్లను తొలగించలేదు. తరువాత ఏం జరిగిందో మరి.. మంగళవారం మధ్యాహ్నం ఎస్‌ఐ విభీషణరావు వచ్చి, టెంట్లు తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయనే దగ్గరుండి ఒక వరుస టెంట్లను తొలగింపజేశారు. ఇక్కడ కోడిపందేలు, గుండాట వంటి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎస్‌ఐ ఉన్నప్పుడు తొలగించిన టెంట్లను రాత్రయిన తరువాత యథావిధిగా బిగించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చినప్పటికీ కూటమి నేతల ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Jan 14 , 2026 | 12:55 AM