వీబీ జీరామ్‌జీతో మరింత మేలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:35 AM
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అమలు చేసే వీబీ జీరామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మండలంలోని చింతలవీధిలో గురువారం వీబీ జీరామ్‌జీ పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.
- కలెక్టర్ టి.నిషాంతి
- జిల్లాలో పథకం పనులు ప్రారంభం
పాడేరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అమలు చేసే వీబీ జీరామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మండలంలోని చింతలవీధిలో గురువారం వీబీ జీరామ్‌జీ పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరిన్ని సంస్కరణలు చేసి వీబీ జీరామ్‌జీ పథకంగా మార్పు చేశారన్నారు. దీంతో గతంలో కంటే అదనంగా ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయన్నారు. గతంలో ఒక కుటుంబానికి ఏడాదిలో 100 రోజులు కల్పించిన పని దినాలను ఇకపై 125 రోజులకు పెంచారని, రోజువారీ వేతనం సైతం రూ.275 నుంచి రూ.312లు చేశారన్నారు. ఈ పథకంలో కేవలం ఉపాధి కల్పనకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉత్పాదకత ఆస్తుల నిర్మాణం లక్ష్యంగా చర్యలు చేపడతారన్నారు. జల సంరక్షణ, వనరుల నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, జలధార- జలహారతి వంటి కార్యక్రమాలకు వీబీ జీరామ్‌జీ పథకాన్ని అనుసంధానిస్తారన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక రకాల పనులు ఈ పథకంలో చేపడతారని తెలిపారు. ఎటువంటి దుర్వినియోగానికి అవకాశం లేకుండా ఈ-కేవైసీ ద్వారా నిరంతర పర్యవేక్షణ, నిఘా ఉంటుందన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కలెక్టర్ సూచించారు.
పేదల ఆకలి తీర్చే పథకం
వీబీ జీరామ్‌జీ పథకం పేదల ఆకలి తీర్చే చక్కని పథకమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గతంలో తినేందుకు తిండి, చేసేందుకు పనులు లేని పరిస్థితులుండేవని, కానీ నేడు అందుకు భిన్నంగా పేదలను సంపూర్ణంగా ఆదుకునేందుకు వీబీ జీరామ్‌జీ పథకం ఉందన్నారు. అలాగే భవిష్యత్తులో ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రతిపాదనలున్నాయని, అదే జరిగితే రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే పంట పొలాలకు సాగునీరు అందించడం, కందకాలు నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చింతలవీధి ప్రాంతంలో వీబీ జీరామ్‌జీ పథకంలో భాగంగా చేపట్టే పనులను కలెక్టర్ నిషాంతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డ్వామా పీడీ విద్యాసాగరరావు గునపాలతో తవ్వి ప్రారంభించారు. తిరుపతి జిల్లా కోడూరులో వీబీ జీరామ్‌జీ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రారంభించగా, ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కలెక్టరేట్‌లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, జిల్లా నీటి యాజమాన్య సంస్థకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.