Share News

సీహెచ్‌సీలో గర్భిణులకు మెరుగైన వైద్యం

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:28 PM

స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్యం అందుతోంది. కూటమి ప్రభుత్వం ఎనస్థీషియా, స్త్రీ వైద్యనిపుణులు పోస్టులను భర్తీ చేసింది. దీంతో గర్భిణులకు ప్రతి రోజూ ఆరోగ్య తనిఖీలు, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌లు చేస్తున్నారు.

సీహెచ్‌సీలో గర్భిణులకు మెరుగైన వైద్యం
ఆరోగ్య తనిఖీలకు ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు(ఫైల్‌)

అందుబాటులో గైనికాలజిస్టులు, ఎనస్థీషియా వైద్యులు

ప్రతి రోజూ ఆరోగ్య తనిఖీలు, స్కానింగ్‌లు

మైదాన ప్రాంతాలకు తగ్గిన రిఫల్‌ కేసులు

చింతపల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్యం అందుతోంది. కూటమి ప్రభుత్వం ఎనస్థీషియా, స్త్రీ వైద్యనిపుణులు పోస్టులను భర్తీ చేసింది. దీంతో గర్భిణులకు ప్రతి రోజూ ఆరోగ్య తనిఖీలు, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌లు చేస్తున్నారు. నెలలో ఆస్పత్రిలో 90 నుంచి 98 సహజ ప్రసవాలు, 15 నుంచి 17 సీజేరియన్లు జరుగుతున్నాయి. దీంతో రిఫరల్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వైసీపీ ప్రభుత్వం ఏరియా ఆస్పత్రిలో ఖాళీగానున్న ఎనస్థీషియా, స్త్రీ వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేయలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గిరిజనుల వైద్యానికి పెద్దపీట వేసింది. తొలిప్రాధాన్యంగా ఖాళీగానున్న వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేసింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న స్త్రీ వైద్యనిపుణులు, ఎనస్థీషియా పోస్టులు భర్తీకావడంతో గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.

గర్భిణులకు తీరిన కష్టాలు

స్థానిక ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్లు అందుబాటులోకి రావడంతో గర్భిణులకు కష్టాలు తీరాయి. గతంలో ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవం కష్టమైతే నర్సీపట్నం, పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాల్సివచ్చేది. దీంతో గర్భిణులు పురిటినొప్పులతో అంబులెన్స్‌లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి అవస్థలు పడేవారు. కొన్ని సందర్భాల్లో మార్గ మధ్యలోనే ప్రసవం జరిగేది.

తగ్గిన రిఫరల్‌ కేసులు

నర్సీపట్నం, కేజీహెచ్‌, పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించే గర్భిణుల రిఫరల్‌ కేసులు గణనీయంగా తగ్గాయి. గతంలో నెలలో 64 నుంచి 74గర్భిణులను మైదాన ప్రాంతాలకు పంపించేవారు. ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. జూలైలో 24 మంది గర్భిణులను మాత్రమే మైదాన ప్రాంత ఆస్పత్రులకు తరలించారు. ప్రతి నెలా 850 నుంచి 950 మంది గర్భిణులు ఆరోగ్య తనిఖీలు, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌లు చేయించుకుంటున్నారు. నెలలో 92 నుంచి 98 సహజ ప్రసవాలు, 15 నుంచి 17 సీజేరియన్లు, 40 నుంచి 50 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. జూలైలో 92 సహజ ప్రసవాలు, 17 సీజేరియన్లు, 63 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగాయి. గర్భిణి ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి ప్రసవం పొందే వరకు వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. శిశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. ఏరియా ఆస్పత్రికి అనుబంధంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రం, చిన్నిపిల్లల వైద్యనిపుణులు అందుబాటులో ఉండడంతో శిశువులకు మెరుగైన చికిత్స అందుతున్నది.

Updated Date - Aug 21 , 2026 | 10:28 PM