Share News

భక్తులకు మెరుగైన సేవలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:31 AM

ప్రజాప్రతినిదులు, సిబ్బంది సమష్టి కృషితో అప్పన్న ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటానని సింహాచలం ఈవో జె.వెంకటరావు అన్నారు.

భక్తులకు మెరుగైన సేవలు

సింహాచలం నూతన ఈవో వెంకటరావు

సింహాచలం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):

ప్రజాప్రతినిదులు, సిబ్బంది సమష్టి కృషితో అప్పన్న ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటానని సింహాచలం ఈవో జె.వెంకటరావు అన్నారు. పూర్వపు ఈవో, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ నున్న సుజాత నుంచి ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న చందనోత్సవం, వార్షిక తిరుకల్యాణోత్సవాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. ప్రముఖులకు ప్రాధాన్యత ఇస్తూనే సాధారణ భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాల విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. సాధారణ రోజుల్లోనూ భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని, ఆలయ ఆచార, సంప్రదాయలను గౌరవిస్తూనే అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. దాతలు విరాళాలుగా అందజేసిన స్వామివారి ఆస్తుల పరిరక్షణపై శ్రద్ధ పెడతామన్నారు. తొలుత సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ఈవో వెంకటరావుకు ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న ఈవో గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో పూజల అనంతరం పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలీయగా, అధికారులు శాలువతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.

Updated Date - Feb 09 , 2026 | 12:31 AM