Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:38 AM

రోగులకు మెరుగైన వైద్య సేవలు

రోగులకు మెరుగైన వైద్య సేవలు
: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

- వైద్యులు, సిబ్బందికి కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచన

- ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆకస్మిక సందర్శన

- ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ నమోదు పెంచాలని సూచన

పాడేరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న రోగులతో మాట్లాడారు. అలాగే పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లను పలకరించారు. పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ ఒంటిపాక నుంచి వచ్చిన మలేరియా బాధితురాలు కిల్లో తులసి, మానసిక సమస్యతో వచ్చిన కిడారి ప్రణీత్‌, కాలు విరిగి వైద్యం పొందుతున్న అల్లంగి రాంబాబులను ఆయన స్వయంగా పలకరించి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో వ్యాధి నిర్ధాణ పరీక్షలు చేయడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. ఆస్పత్రి ప్రాంగణం, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

’అబా యాప్‌’తో డిజిటల్‌ నమోదును పెంచాలి

రోగుల ఆరోగ్యం, వైద్య సేవలు డిజిటలేషన్‌లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌’ యాప్‌తో డిజిటల్‌ నమోదును పెంచాలని కలెక్టర్‌ సూచించారు. అబా యాప్‌ ద్వారా నమోదు చేసుకుని అకౌంట్‌ నంబర్‌ను పొందడం వల్ల ఓపీ వద్ద రద్దీ తగ్గడంతో రోగులకు సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఓపీతో పాటు రోగులకు సంబంధించిన సమస్త ఆరోగ్య సమాచారం, అందిస్తున్న వైద్య సేవలు, తదితర అన్ని విషయాలు అబా అకౌంట్‌లో పొందుపరచడంతో ప్రస్తుత, భవిష్యత్తు ఆరోగ్య సేవలను పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దానిపై ప్రజల్లో మరింత అవగాహన ఏర్పరచి, అబా యాప్‌లో నమోదును మరింతంగా పెంచాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అబా యాప్‌ నమోదు కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను ఆయన స్కాన్‌ చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ ఎర్రయ్య, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:38 AM