మెరుగైన వైద్య సేవలందాలి
ABN , Publish Date - May 13 , 2026 | 01:03 AM
కేజీహెచ్‌తోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరిపాలనలో బాధ్యత, పర్యవేక్షణ, సిబ్బంది వినియోగం, మార్గదర్శక వ్యవస్థ బలోపేతం చేయాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు.
- ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్
కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్‌తో కలిసి సమీక్ష
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌తోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరిపాలనలో బాధ్యత, పర్యవేక్షణ, సిబ్బంది వినియోగం, మార్గదర్శక వ్యవస్థ బలోపేతం చేయాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో మంగళవారం కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సిబ్బంది అందుబాటులో లేక రోగులు వైద్య సేవల కోసం నిరీక్షించాల్సి వస్తోందన్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ల్యాబ్ పరీక్షల్లో జాప్యం లేకుండా చూడాలనానరు. ఆస్పత్రి సేవలపై వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని విభాగాల్లో పడకల కొరత కారణంగా ఇద్దరు రోగులు ఒకే బెడ్‌ను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉందని, మరికొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా కనిపిస్తున్నాయన్నారు. అత్యవసర విభాగాల్లో సౌకర్యాలు విస్తరణ, ఎయిర్ కండిషనింగ్ సమస్యల పరిష్కారం, మరుగుదొడ్ల నిర్వహణ, స్ర్టెచర్లు, పార్కింగ్ నిర్వహణ వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. నిరక్షరాస్యులు ఆస్పత్రి వ్యవస్థలో ఎలా ముందుకువెళ్లాలో సమాచారం, మార్గదర్శకత్వం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన మందులు, ఇతర సామగ్రి బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం వంటి సేవలకు డబ్బులు డిమాండ్ చేస్తే సహించబోమన్నారు. అత్యుత్తమ సేవలుందిస్తున్న వైద్యులు, సిబ్బందిని ప్రోత్సహించడంతోపాటు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సంస్కృతి ఏర్పడుతుందన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ రోగులకు మార్గదర్శకం అందించేందుకు ఆస్పత్రి పరిధిలో ఎనిమిది మే ఐ హెల్ప్ యూ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఓపీ విభాగం, ల్యాబ్ కేంద్రాలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో నర్సింగ్ విద్యార్థులు, భద్రతా సిబ్బంది, పారిశుధ్య సిబ్బందితో సహాయక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సమాచార కేంద్రాల ఏర్పాటును దశల వారీగా చేపడుతున్నామన్నారు. రోగుల ఫాలోఅప్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ ఫిర్యాదుల కోసం కంప్లైంట్ బాక్స్‌లు, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచామని, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై సస్పెన్షన్, టెర్మినేషన్ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ జరుపుతున్నామన్నారు. సమావేశంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతం రాజు సుధాకర్, విభాగాధిపతులు, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.