మరింత మెరుగ్గా వైద్య సేవలు
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:48 PM
జిల్లా ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లాలో వైద్య సేవలపై ఆయా శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ టి.నిశాంతి ఆదేశం
విద్యార్థులు, బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన
పాడేరు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లాలో వైద్య సేవలపై ఆయా శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అరకులోయలోని ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయా నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో మలేరియా కారక దోమల నివారణ మందు పిచికారీ పనులు చేపట్టాలని, దోమతెరల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, వారికి ఈ నెల 24వ తేదీలోగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా 14, 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పక్కాగా చేపట్టాలని, ప్రతి బాలికకు వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. అందుకు గాను బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వైద్య, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జిల్లాలో 108, 104 సేవలను సక్రమంగా అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు జారీ కావాలని, అలాగే వాటికి ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కృష్ణమూర్తినాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్, డీజీహెచ్‌ఎస్ కృష్ణవేణి, వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.