తమలపాకు రైతు ఖుషీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:23 AM
తమలపాకుల ధరలు పెరగడంతో సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో కురిసిన వర్షాలతో కార్శి తోటలు చనిపోవడం, మొక్క తోటల్లో దిగుబడి తగ్గడంతో మార్కెట్ అవసరాలకు సరిపడ తమలపాకుల ఉత్పత్తి లేదని, దీంతో డిమాండ్ అధికంగా వుందని ఎగుమతి వ్యాపారులు చెబతున్నారు. కాగా సుమారు నెల రోజుల నుంచి తమలపాకుల ధరలు క్రమేపీ పెరుగుతుండడంతో ఆదాయం ఆశాజనకంగా వుంటుందని, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అనూహ్యంగా పెరిగిన ధరలు
100 పంతాలు రూ.9 వేలు
గతంలో రూ.3,500లకు మించిన పలకని వైనం
పాయకరావుపేట రూరల్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తమలపాకుల ధరలు పెరగడంతో సాగుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో కురిసిన వర్షాలతో కార్శి తోటలు చనిపోవడం, మొక్క తోటల్లో దిగుబడి తగ్గడంతో మార్కెట్ అవసరాలకు సరిపడ తమలపాకుల ఉత్పత్తి లేదని, దీంతో డిమాండ్ అధికంగా వుందని ఎగుమతి వ్యాపారులు చెబతున్నారు. కాగా సుమారు నెల రోజుల నుంచి తమలపాకుల ధరలు క్రమేపీ పెరుగుతుండడంతో ఆదాయం ఆశాజనకంగా వుంటుందని, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో తమలపాకు తోటలు అత్యధికంగా పాయకరావుపేట మండలంలో వున్నాయి. సత్యవరం, మాసాహెబ్‌పేట, పెదరాంభద్రపురం, కొత్తూరు, మంగవరం, అరట్లకోట, పెద్దిరాజుపాలెం తదితర గ్రామాలతోపాటు ఎస్.రాయవరం మండలం వమ్మవరం, ధర్మవరం, పెనుగొల్లు గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో తమలపాకు తోటలను సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. తమలపాకు తీగను పాకించడానికి పొలంలో తొలుత అవిసె మొక్కలు నాటాలి. అవి సుమారు ఐదు అడుగుల ఎత్తు పెరిగిన తరువాత తమలపాకు తీగలను నాటుతారు. ఇది అత్యంత సున్నితమైన పంట. నీరు, మంచు అధికమైతే తోటలు దెబ్బతింటాయి. ఈదురు గాలులు వీస్తే నేలవాలతాయి. తెగుళ్ల బెడద కూడా ఎక్కువే! దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల తమలపాకు తోటలను చంటిపిల్లల మాదిరిగా చూసుకుంటుంటారు. అయినప్పటికీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోతే పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి వుండదు. గత కొన్నేళ్లుగా గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్న రైతులకు.. సుమారు నెల రోజుల నుంచి పెరుగుతున్న ధరలతో ఊరట చెందుతున్నారు. సుమారు 150 నుంచి 170 తమలపాకులు వుంటే పంతం ధర ప్రస్తుతం రూ.90 పలుకుతున్నది. ఎగుమతి వ్యాపారులు వంద పంతాలను రూ.9 వేలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో వంద పంతాల ధర రూ.10 వేలు పలికింది. గత ఏడాది ఇదే సమయంలో వంద పంతాలు రూ.3,500లకు మించి ధర లభించలేదని రైతులు చెబుతున్నారు. అయితే ఎకరాకు మూడు వేల పంతాల దిగుబడి వచ్చేదని, ఇప్పుడు వెయ్యి పంతాలకు మించి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. కాగా గత ఏడాది డిసెంబరులో కురిసిన వర్షాలతో కార్శి తోటలు చనిపోయాయని, మొక్క తోటల్లో దిగుబడి అంతగా లేదని, దీంతో ధరలు పెరుగుతున్నాయని ఎగుమతి వ్యాపారులు చెబతున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగపూర్, అకోలా, వార్దా, చంద్రాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్), ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు.