Share News

నయాపైసా మొక్కతో పంటలకు మేలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:45 PM

గిరిజన ప్రాంతంలో విరివిగా లభించే నయాపైసా మొక్క పచ్చిరొట్ట తరహాలో పంటలకు ఎన్నో పోషకాలు అందిస్తుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అధ్యయనంలో రుజువైంది.

నయాపైసా మొక్కతో పంటలకు మేలు
గిరిజనులు కంచెగా పెంచుతున్న నయాపైసా మొక్క

పచ్చిరొట్ట తరహాలో ఎన్నో పోషకాలు ఉన్నట్టు గుర్తించిన వ్యవసాయాధికారులు

గిరిజన ప్రాంతంలో విరివిగా లభిస్తున్న మొక్క

చింతపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

గిరిజన ప్రాంతంలో విరివిగా లభించే నయాపైసా మొక్క పచ్చిరొట్ట తరహాలో పంటలకు ఎన్నో పోషకాలు అందిస్తుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అధ్యయనంలో రుజువైంది. ఈ మొక్కల ఆకులను భూమిలో కలియదున్నుకుంటే పంటలకు అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఖర్చులేకుండా ఆకులను రైతులు వినియోగించడం వల్ల నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని స్థానిక మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు తెలిపారు.

గిరిజన ప్రాంత అడవులు, గ్రామాల్లో నయాపైసా మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ మొక్కను సాధారణంగా రైతులు కంచె కోసం, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ మొక్క ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని పచ్చిరొట్ట మాదిరిగా నయాపైసా ఆకులను వినియోగించడం మంచిదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సాగుకు ముందు రైతులు పచ్చిరొట్ట జనుము, పిల్లిపెసర, జీలుగ రకాల విత్తనాలను పంట పొలాల్లో నాటుకుని నాట్లుకు ముందుగా భూమిలో కలియదున్నుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పంటలకు అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. అయితే గిరిజన ప్రాంతంలో సహజసిద్ధంగా లభించే నయాపైసా మొక్కల నుంచి ఆకులతో కూడిన రెమ్మలను సేకరించి పంట పొలాల్లో ఆఖరి దుక్కిలో కలియదున్నుకోవడం వల్ల పచ్చిరొట్ట అందించే పోషకాలు పంటలకు అందుతాయి.

నయాపైసా అంటే ఏమిటి..?

నయాపైసా మొక్కను గ్లైరిసిడియా అని పిలుస్తారు. ఫాబేసి కుటుంబంతో పాటు లెగ్యూమ్‌ జాతికి చెందిన ఈ మొక్కలు మధ్యస్థంగా పెరుగుతాయి. సుమారు 33 నుంచి 38 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతాయి. ఈ మొక్కల్లోని అన్ని భాగాలు బహుళ ప్రయోజనాలు అందిస్తాయి. పంటలకు కంచెగా, వంట చెరకుగా, పశువులకు మంచి పోషకాలు అందించే పశుగ్రాసంగా, పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది.

వీటి వల్ల కలిగే ప్రయోజనాలు

నయాపైసా మొక్కలు భూసారాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు గుర్తించారు. ప్రధానంగా వాతావరణంలో లభించే నత్రజనిని భూమిలో స్థిరీకరించి భూసారాన్ని పెంచుతుంది. మన దేశంతో పాటు పలు దేశాల్లో వీటిని ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. కొందరు రైతులు అంతర పంటగాను వీటిని సాగు చేస్తున్నారు. ఈ నయాపైసా ఆకులు, రెమ్మలు పొలం ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవడం వల్ల పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. ఈ ఎరువు ద్వారా 4 శాతం నత్రజని భూమికి అందుతుంది. ఎకరాకు ఒకటి నుంచి రెండు టన్నుల వరకు పచ్చి ఆకులను ఆఖరి దుక్కిలో కలియదున్నుకోవాలి. ఈ మొక్కల విత్తనాలు, బెరడు ఎలుకల నివారణకు ఉపయోగపడతాయి. గిరిజన ప్రాంతంలో రైతులు వర్షాధారంగా పండించే పంటలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలను పొలాల గట్లు వద్ద పెంచుకోవడం వల్ల పర్యావరణానికి హాని కలిగించని ఎరువు లభిస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated Date - Jul 09 , 2026 | 11:45 PM