విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు టీడీపీ కో-ఆర్డినేటర్‌గా బెందాళం అశోక్
ABN , Publish Date - May 16 , 2026 | 12:35 AM
విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ నియమితులయ్యారు.
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ ఉత్తరాంధ్ర పరిధిలో పార్లమెంటు స్థానాలకు ప్రకాశం జిల్లాకు చెందిన దామచర్ల సత్య జోనల్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అయితే, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, అరకులోయ పార్లమెంటు స్థానాలకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను, విశాఖ, అనకాపల్లి నియోజకవర్గాలకు అశోక్‌ను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. అశోక్ ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నారు.
కలెక్టరేట్‌లో ఇంధన పొదుపు
ఎస్కార్ట్ వాహనం వద్దన్న కలెక్టర్
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ ఇంధన పొదుపు చర్యలు చేపట్టారు. ఎస్కార్ట్‌గా ఉండే వాహనాన్ని నిలిపివేశారు. శుక్రవారం ఆయన ఒక వాహనంతోనే కలెక్టరేట్‌లో విధులకు హాజరయ్యారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందించారు. అయితే కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్, ఇతర సమీక్షలకు జిల్లా అధికారులు ఒక్కొక్కరు ఒక్కో వాహనం వినియోగిస్తుంటారు. జిల్లా అధికారులంతా సమన్వయం చేసుకుని ఇద్దరు, ముగ్గురు కలిసి ఒక వాహనంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగానికి ఎమ్మెల్యేల శ్రీకారం
జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇంధనం పొదుపు చేసేందుకు ఎలక్ర్టిక్ వాహనాల్లో ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆ తరువాత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ‘నా దేశం-నా బాధ్యత’ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. ఖరీదైన బెంజ్ కారులో తిరిగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం నుంచి కియా ఎలక్ర్టిక్ కారును ఉపయోగిస్తున్నారు. అందులోనే నియోజకవర్గ పర్యటనకు బయలుదేరివెళ్లారు. వెనుక కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను కూడా తగ్గించారు. ఇకపోతే ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వం తనకు ప్రొటోకాల్ కింద కేటాయించిన కారును పక్కనపెట్టేశారు. ఇంతకు ముందే సొంత అవసరాలకు కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రిక్ కారులోనే శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఇదే బాటలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కొత్త ఈవీల కొనుగోళ్లపై దృష్టిపెట్టినట్టు సమాచారం.
ఏపీయూజీబీసీఎల్‌కు భూ కేటాయింపు రద్దు
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
అడవివరం సర్వే నంబర్ 275లో ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీయూజీబీసీఎల్)కు గతంలో సింహాచలం దేవస్థానం లీజుపై కేటాయించిన 32.09 ఎకరాలను రద్దు చేస్తూ దేవదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 అక్టోబరులో ఈ భూమిని మొక్కల పెంపకం, నర్సరీ ఏర్పాటుకు ఇచ్చారు. ఆ లీజు గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తుంది. అయితే ఇటీవల దేవస్థానం ఇదే సర్వే నంబరులో గూగుల్ డేటా సెంటర్‌కు 160 ఎకరాలు లీజుకు కేటాయించింది. అందులో ఈ 32 ఎకరాలు కూడా ఉన్నాయి. దాంతో ఏడాది మందే ఆ లీజును రద్దు చేస్తూ, ఆ భూమిని గూగుల్‌కు అప్పగించాలని సూచించారు.
సింహాచలం ట్రస్ట్ బోర్టుపై టీడీపీలో అసంతృప్తి!
‘నార్త్’ నుంచి శ్రీలతను సభ్యురాలిగా నియమించడంపై నేతల ఆగ్రహం
‘పెందుర్తి’ నుంచి కరక దేవుడుకు స్థానం కల్పించడంపై బాబ్జీ వర్గీయుల కినుక
విశాఖపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డులో టీడీపీ తరపున నియమితులైన ఇద్దరు సభ్యులపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గుత్తికొండ శ్రీలత నియామకాన్ని నేతలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ హోటల్‌లో కీలక పదవిలో ఉన్న శ్రీలత నియామకానికి సంబంధించి జిల్లాలో ప్రజా ప్రతినిధులను, నియోజకవర్గ నేతలను అధిష్ఠానం సంప్రతించలేదని చెబుతున్నారు. ఆమె నియామకంపై పార్టీ నేతలు తమ అసంతృప్తిని ఎంపీ ఎం.శ్రీభరత్‌కు, జిల్లా నాయకత్వానికి తెలియజేశారు. నగరంలో ప్రముఖ బిల్డర్ సిఫారసుతో శ్రీలతను ట్రస్ట్ బోర్డులో నియమించారని నాయకులు చెబుతున్నారు. అలాగే పెందుర్తి నియోజకవర్గం నుంచి ట్రస్ట్ బోర్డులో కరక దేవుడు నియామకంపై ఇన్‌చార్జి గండి బాబ్జీకి కనీసం సమాచారం లేదు. 2024 ఎన్నికల్లో పెందుర్తినియోజకవర్గంలో అన్ని బూత్‌లలో జనసేనకు మెజారిటీ రాగా కరక దేవుడు సొంతూరులో వైసీపీకి మెజారిటీ వచ్చిందని, అటువంటి వ్యక్తికి ఎలా అవకాశం ఇస్తారని గండి బాబ్జీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.