Share News

నమ్మండి.. ఇది పాఠశాలేనండి!

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:24 AM

మండలంలోని అంతాడ పంచాయతీ తాటిమానుపాలెం ఎంపీపీ పాఠశాల గ్రామస్థులు ఏర్పాటు చేసిన షెడ్డులో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ల క్రితం గ్రామస్థులు రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు.

నమ్మండి.. ఇది పాఠశాలేనండి!
కొయ్యూరు మండలం తాటిమానుపాలెంలో ఎంపీపీ పాఠశాల రేకుల షెడ్డులో కొనసాగుతున్న దృశ్యం

రేకుల షెడ్డులో కొనసాగుతున్న తాటిమానుపాలెం ఎంపీపీ పాఠశాల

ఎండ, వానకు విద్యార్థుల అవస్థలు

కొయ్యూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంతాడ పంచాయతీ తాటిమానుపాలెం ఎంపీపీ పాఠశాల గ్రామస్థులు ఏర్పాటు చేసిన షెడ్డులో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ల క్రితం గ్రామస్థులు రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ షెడ్డులోనే పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఎండకు ఇబ్బంది పడుతూ, వర్షానికి తడుస్తూ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కనీస వసతులు లేని ఈ పాఠశాలలో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పెదబయలులో..

పెదబయలు: మండలంలోని పొయిపల్లి పంచాయతీ పరిధిలోని గల్లెలపుట్టు ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో 54 మంది విద్యార్థులున్నారు. వీరంతా రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం కింద నిధులు మంజూరైనా భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు సొంత నిధులతో రేకుల షెడ్డును ఏర్పాటు చేసి విద్యార్థులకు తాత్కాలిక వసతి కల్పించారు. ప్రస్తుతం ఈ షెడ్డుకు రంధ్రాలు ఏర్పడడంతో వర్షపు నీరు లోపలికి వస్తోంది. దీంతో పుస్తకాలు తడవడంతో పాటు విద్యార్థులు కూర్చోవడానికీ అవస్థలు పడుతున్నారు. ఉపాధ్యాయులు బోధనకు ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:24 AM