కాళ్ల పారాణి ఆరకముందే...
ABN , Publish Date - May 11 , 2026 | 12:55 AM
అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడడుగులు వేసిన వ్యక్తితో ఎన్నో ఆశలతో ఆమె నగరంలో అడుగుపెట్టింది.
వివాహమైన రెండు నెలలకే నవ వధువు మృతి
ఆత్మహత్య చేసుకుందన్న భర్త
కట్నం కోసం వేధించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు
నిందితుడి అరెస్టు
మద్దిలపాలెం, మే 10 (ఆంధ్రజ్యోతి):
అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడడుగులు వేసిన వ్యక్తితో ఎన్నో ఆశలతో ఆమె నగరంలో అడుగుపెట్టింది. కానీ రెండు నెలలు తిరగకముందే జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా, కట్నం కోసం హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం శిమ్మపేటకు చెందిన లక్ష్మీనారాయణ, శారదల రెండో సంతానం తేజశ్రీ (22). ఆమెకు అదే జిల్లా అరాగోలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన దప్ప సోమేశ్వరరావుతో మార్చి మూడో తేదీన వివాహం చేశారు. కట్నం కింద రూ.18 లక్షలు నగదు, 19 తులాల బంగారు ఆభరణాలు, సారె, లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఇచ్చారు. తాను విశాఖ డాక్‌యార్డులో పనిచేస్తున్నానని, రామాటాకీస్ వద్ద ఉమెన్స్ హాస్టల్ ఉందని, వాటి ద్వారా నెలకు రూ.2 లక్షల ఆదాయం వస్తున్నట్టు సోమేశ్వరరావు తన అత్త మామలకు చెప్పాడు. వివాహం అనంతరం సోమేశ్వరరావు, తేజశ్రీ రేసపువానిపాలెంలో కాపురం పెట్టారు. ఇక్కడకు వచ్చిన మరుసటిరోజు నుంచే సోమేశ్వరరావు మరింత కట్నం కావాలంటూ భార్యను వేధించసాగాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలపగా సర్దుకుపోవాలని సూచించారు. కాగా ఈ నెల ఏడో తేదీన శారద తన కుమార్తెకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేసి ‘మీ కుమార్తె ఉరి వేసుకుంది’ అని చెప్పడంతో వెంటనే నగరానికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా విగతజీవిగా మంచంపై పడి ఉండడంతో గుండెలు అవిసేలా రోదించారు. తేజశ్రీ శరీరంపై గాయాలు, మెడపై గట్టిగా బిగించిన గుర్తులు కనిపించడంతో అల్లుడే కట్నం కోసం హత్య చేశాడని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి శారద ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు 85, 108 బీఎన్‌ఎస్, 3,4 డీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం సోమేశ్వరరావును అరెస్టు చేశారు.
స్ర్కాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం
సుమారు రూ.2 కోట్లు నష్టం
విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం
ఆటోనగర్, మే 10 (ఆంధ్రజ్యోతి):
గాజువాక ఆటోనగర్‌లోని ‘ఎఫ్’ బ్లాకులో గల శ్రీరాధేకృష్ణట్రేడర్స్, జైవాయి మాతా ట్రేడర్స్‌కు చెందిన స్ర్కాప్ గోడౌన్‌లో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ సామగ్రి, ఇతర వ్యర్థాలన్నింటికీ మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించి వాచ్‌మన్ తమ యజమానులైన సన్నీ లిఖమానియా, నిఖిల్ నిఖమానియాలకు ఫోన్ చేశారు. వారు తొలుత ఆటోనగర్‌లో గల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఆటోనగర్ అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోవడంతో పెదగంట్యాడ, మర్రిపాలెం, విశాఖపట్నం, బీహెచ్‌పీవీ, స్టీలుప్లాంటు ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు ఏడు గంటలు పాటు శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక అధికారులు గోపికృష్ణ, వరప్రసాద్, కేవీటీ ప్రసాద్, శ్రీనివాస్ తెలిపారు. ప్రాణ హాని జరగలేదు కానీ, ఎక్కువ వ్యర్థాలు దగ్ధమవ్వడంతో సుమారు రెండు కోట్ల రూపాయిల మేర నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఢిల్లీ తీసుకువెళ్లి రీ సైక్లింగ్ చేసి, ప్లాస్టిక్ బాటిల్స్, తదితర సామగ్రి తయారీలో వినియోగిస్తారు. సమాచారం తెలుసుకున్న ఐలా కమిషనర్ ఎ.కిషోర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు, కంపెనీ నిర్వాహకులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అక్కడ అగ్నిమాపక పరికరాలు లేకపోవడం వల్ల భారీ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడకు వచ్చినవారు ఆరోపిస్తున్నారు.
ప్రశాంతంగా ఆఈట్
విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సు (సెల్ఫ్ సపోర్టు)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఆఈట్)-2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 5,327 మంది దరఖాస్తు చేసుకోగా, 4,707 మంది (88.36 శాతం) హాజరయ్యారు. నగర పరిధిలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాన్ని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శశి, అడ్మిషన్స్ విభాగ డైరెక్టర్ డీఏ నాయుడు, అసోసియేట్ డైరెక్టర్ డీబీ వెంకటాద్రి తనిఖీ చేశారు.
రేషన్ బియ్యం మాఫియాపై విజిలెన్స్
పలు డిపోలపై దాడులు
నాలుగు డిపోలపై పౌర సరఫరాల శాఖ కేసులు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రేషన్ బియ్యం మాఫియాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాల శాఖలు దాడులు ముమ్మరం చేశాయి. గడచిన నాలుగైదు రోజుల్లో పలు డిపోలను తనిఖీ చేసి కేసులు నమోదుచేశాయి. ‘రేషన్ మాఫియాతో లాలూఛీ’ శీర్షికన ఈనెల ఏడో తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌర సరఫరాల శాఖలు స్పందించి వేర్వేరుగా దాడులు చేపట్టాయి. వన్‌టౌన్‌లో రెండు, మూడు డిపోలు, హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక డిపోలో సరుకుల నిల్వలో తేడా ఉండడంతో పౌర సరఫరాల శాఖ కేసులు నమోదుచేసింది. జగదాంబ జంక్షన్ నుంచి కోట వీధి వరకు పలు డిపోలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు నగరంలో బినామీ డీలర్ల వివరాలను పౌర సరఫరాల శాఖ సేకరిస్తోంది. ఇద్దరు, ముగ్గురు బినామీ డీలర్లు ఐదు నుంచి పది డిపోలు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా కూటమి నేతల దన్నుతో కొందరు నెలనెలా మామ్మూళ్లు ఇవ్వాలని డీలర్లను బెదిరిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.
ఏయూలో నైపుణ్య అభివృద్ధి
రూ.3 కోట్లతో ఐ ఫ్యాక్టరీ నెట్‌వర్క్ ల్యాబ్ ఏర్పాటు
విద్యార్థులకు, పరిశ్రమల నిర్వాహకులకు అవసరమైన శిక్షణ అందజేత
ఉద్యోగాలు సాధించేందుకు దోహదం
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు కలిగి ఉన్నప్పుడే మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం రూ.3 కోట్లతో ఐ ఫ్యాక్టరీ నెట్‌వర్క్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది. దీనికి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ సహకారాన్ని అందించింది. పరిశ్రమల శాఖ రూ.2.4 కోట్లు అందించగా, వర్సిటీ అధికారులు మరో రూ.60 లక్షలు మ్యాచింగ్ గ్రాంటుగా కేటాయించి ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఈ ల్యాబ్‌లో విద్యార్థులకు, వివిధ పరిశ్రమల నిర్వాహకులకు ఇండస్ర్టీ 4.0పై శిక్షణ ఇస్తారు. దీనికి పూణెకు చెందిన సీ4ఐ4 (సెంటర్ ఫర్ ఇండస్ర్టీ 4.0) సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.ఈ సెంటర్ నిర్వహణ బాధ్యతను ఏయూలోని కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (సీపీడీసీ) చూస్తోంది. ఈ ల్యాబ్ ద్వారా మెకానికల్, ఎలక్ర్టికల్, ఎలక్ర్టానిక్స్, ఇనుస్ర్టుమెంటేషన్, కెమికల్, మెటలర్జీ ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలను కల్పించనున్నారు. ఈ శిక్షణ వల్ల విద్యార్థి ఉద్యోగంలో చేరిన వెంటనే నేరుగా విధులు నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది.