Share News

లంబసింగిలో అందాల పూదోట

ABN , Publish Date - Jan 12 , 2026 | 10:47 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో యువ రైతులు సాగు చేస్తున్న విభిన్న రకాల పూల తోట ప్రకృతి అందాలకు వన్నె తెచ్చింది.

లంబసింగిలో అందాల పూదోట
సాగు చేస్తున్న వివిధ వర్ణాల ఆంతూరియం

స్ట్రాబెర్రీతో పాటు విభిన్న రకాల పూలను సాగు చేస్తున్న యువ రైతులు

శీతల పంటలు జుకినీ, బ్రకోలి సైతం..

ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్న పర్యాటకులు

చింతపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో యువ రైతులు సాగు చేస్తున్న విభిన్న రకాల పూల తోట ప్రకృతి అందాలకు వన్నె తెచ్చింది. మూడు ఎకరాల విస్తీర్ణంలో వివిధ వర్ణాల చామంతి, జెర్బరా, ఆంతూరియం, దాలియా, బంతితో పాటు పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. అరుదైన బ్రకోలి, జుకినీ కూరగాయలను సైతం పండిస్తున్నారు. ఈ పూల తోటను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు, స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.

పిఠాపురానికి చెందిన కసిరెడ్డి కృష్ణ, నర్సీపట్నానికి చెందిన సత్యనారాయణ అన్నదమ్ములు. కృష్ణ డిగ్రీ పూర్తి చేయగా, సత్యనారాయణ అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తి చేశారు. వీరికి వ్యవసాయం అంటే ఇష్టం. దీంతో ఆరేళ్ల క్రితం చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ కేంద్రంలో పదెకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. స్థానిక గ్రామ సచివాలయం పక్కనున్న ఈ స్ట్రాబెర్రీ తోటకు ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్‌గా నామకరణం చేసి మార్కెటింగ్‌ చేస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగుతో మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది స్ట్రాబెర్రీతో పాటు మూడు ఎకరాల్లో వివిధ రకాల పూల తోట, రెండు ఎకరాల్లో అరుదైన కూరగాయల పంటలను పండిస్తున్నారు. చామంతి, బంతి పూలను సేకరించి మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. ఇతర పూలను కేవలం పర్యాటకుల సందర్శన కోసం పెంచుతున్నారు.

సందర్శకులను ఆకట్టుకుంటున్న వివిధ రకాల పూలు

స్ట్రాబెర్రీ పండ్ల కోసం వచ్చే పర్యాటకులను వివిధ రకాల పూలు ఉన్న తోట అమితంగా ఆకట్టుకుంటున్నది. యువ రైతులు బెడ్స్‌ రూపంలో ఒక్కొక్క రకం పూలు 20 సెంట్లు నుంచి 40 సెంట్లు విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఎరుపు, పసుపు, తెలుపు వర్ణాల జెర్బరా, చామంతి, నీలి రంగు దాలియా, పసుపు, నీలం, ఎరుపు, తెలుపు వర్ణాల ఆంతూరియం, పసుపు, నారింజ వర్ణంలో బంతి పూలను సాగు చేస్తున్నారు. అలాగే పూలతోటకు ఆనుకుని 20సెంట్ల విస్తీర్ణంలో పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. ఈ పూల తోటలో సందర్శకులు ప్రవేశించేందుకు రూ.30 రుసుము వసూలు చేస్తున్నారు. పర్యాటకులు పూలతోటలో ఫొటోలు, వీడియో షూట్‌ చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. లంబసింగి సందర్శించిన పర్యాటకులు ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్‌ను సందర్శించి పూల తోటలో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఫామ్‌లో విక్రయిస్తున్న తాజా స్ట్రాబెర్రీలను కొనుగోలు చేస్తున్నారు.

హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్న జుకినీ, బ్రకోలి

గిరిజన ప్రాంత వాతావరణం దేశ, విదేశీ శీతల పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు ద్వారా గుర్తించారు. యువ రైతులు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, అధికారుల సహకారంతో జుకినీ, బ్రకోలిని సాగు చేస్తున్నారు. స్టార్‌ హోటళ్లు, మాల్స్‌లో మాత్రమే జుకినీ, బ్రకోలి అందుబాటు ఉంటాయి. ఈ కూరగాయల్లో అత్యధిక పోషక విలువలు ఉండడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా లభిస్తాయి. లంబసింగి వచ్చిన సందర్శకులకు జుకినీ, బ్రకోలి అందుబాటులో ఉండడంతో ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఫామ్‌లో యువత రైతులు సాగు చేసిన జుకినీ, బ్రకోలి హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. కిలో జుకినీ, బ్రకోలి రూ.80 ధరకు విక్రయిస్తున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 10:47 PM