అందాల జలపాతం.. అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:24 PM
మండలంలోని దోనుగుమ్ముల జలపాతం కనీస అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల సందర్శకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కనీస వసతులు లేని దోనుగుమ్ముల
సౌకర్యాలు లేకపోయినా తరలి వస్తున్న పర్యాటకులు
పర్యాటక శాఖ దృష్టి సారించాలని స్థానికుల వేడుకోలు
గూడెంకొత్తవీధి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దోనుగుమ్ముల జలపాతం కనీస అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల సందర్శకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలిబాట మినహా రహదారి సౌకర్యం లేని ఈ జలపాతాన్ని సెలవు రోజుల్లో వందల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. జలపాతం వద్ద కనీస సదుపాయాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
మండలంలోని దోనుగుమ్ముల జలపాతాన్ని 2015లో ‘ఆంధ్రజ్యోతి’ తొలిసారిగా బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. నాటి నుంచి ఈ జలపాతాన్ని పర్యాటకులు సందర్శిస్తున్నారు. గత రెండేళ్లుగా సందర్శకుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో వందల సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శిస్తున్నారు. కార్తీక మాసంలో వేల సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శిస్తుంటారు.
జలపాతానికి ఎలా వెళ్లాలంటే..
చింతపల్లి- సీలేరు ప్రధాన రహదారిలో జీకేవీధి తరువాత వచ్చే సంపంగిగొంది గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు కాలినడక వెళితే దోనుగుమ్ముల జలపాతం వస్తుంది. గతంలో ఈ జలపాతానికి వెళ్లేందుకు కాఫీ తోట మధ్యలో నుంచి కాలిబాటపై నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వుండేది. పర్యాటకులు అధిక సంఖ్యలో జలపాతాన్ని సందర్శిస్తుండడంతో దోనుగుమ్ముల గ్రామానికి చెందిన గిరిజనులు వాహనాలు వెళ్లే మార్గాన్ని శ్రమదానంతో నిర్మించారు. దీంతో ప్రస్తుతం జలపాతం సమీపం వరకు ద్విచక్ర వాహనాలు, జీపులు, కార్లు కూడా వెళుతున్నాయి. అరకిలోమీటరు దూరంలో వాహనాలు నిలిపివేసి జలపాతం వద్దకు నడిచి వెళ్లాలి.
ఆకర్షణీయంగా జలపాతం
దోనుగుమ్ముల జలపాతం సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో నుంచి దిగువకు నీటి ప్రవాహం జరుగుతోంది. శ్వేత వర్ణంలో జలధార వేగంగా కిందకు పడుతుంది. జలపాతం నీటి ప్రవాహం మూడు స్టెప్స్‌ల్లో జరుగుతుంది. నీటి ప్రవాహం జరుగుతున్న బండరాయి మూడు స్టెప్స్ కలిగివుంది. దీంతో జలపాతం చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు ఈ జలపాతంలో జలకాలాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కనీస సౌకర్యాలు కల్పిస్తే..
జలపాతం వద్ద పర్యాటక శాఖగాని, ఐటీడీఏ గాని కనీస సదుపాయాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రామస్థులు నిర్వహించిన మట్టిరోడ్డును కనీసం మెటల్‌రోడ్డుగానైనా నిర్మిస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. పర్యాటకులు సందర్శించడానికి అనువుగా కొత్తపల్లి జలపాతం వద్ద మాదిరిగా మెట్లు ఏర్పాటు చేయాలి. జలపాతం వద్ద మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటుచేయాలి. తాగేందుకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. సీజన్‌లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వనభోజనాలు చేసేందుకు జలపాతానికి వస్తుండడంతో కమ్యూనిటీ భవనం ఒకటి నిర్మిస్తే సందర్శకులకు ఉపయోగకరంగా వుంటుంది.