Share News

గ్రామీణ రహదారులకు శోభ

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:40 AM

జిల్లాలో పలు గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది. కొన్నేళ్లుగా అధ్వానంగా ఉన్న రహదారులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి.

గ్రామీణ రహదారులకు శోభ
పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి వెంకటాపురం వరకు నిర్మించిన బీటీ రోడ్డు

ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల పునర్నిర్మాణం

కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో చకచకా పనులు

పరవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది. కొన్నేళ్లుగా అధ్వానంగా ఉన్న రహదారులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో నూతన శోభను సంతరించుకుంటున్నాయి.

పరవాడ మండలంలోని ప్రధాన రహదారులు గత ఆరేళ్లుగా ఎటువంటి మరమ్మతులకు నోచుకోక దారుణంగా ఉన్నాయి. అడుగడుగునా గోతులు ఉండడంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురయ్యేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల మరమ్మతులపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు దృష్టి సారించారు. సుమారు రూ.6.6 కోట్లు మంజూరు చేయించి నాలుగు గ్రామీణ ప్రధాన రహదారులకు మోక్షం కలిగించారు. జనవరిలో రహదారుల పనులు ప్రారంభించగా వీటిలో నాబార్డు నిధులు రూ.80 లక్షలతో కలపాక నుంచి గొల్లలపాలెం వరకు బీటీ రహదారితో పాటు మరో రూ.60 లక్షలతో వాడచీపురుపల్లి నుంచి వెంకటాపురం వరకు బీటీ రహదారి పనులు పూర్తి చేశారు. అలాగే కలపాక పంచాయతీ పరిధి స్వయంభూవరం నుంచి మూల స్వయంభూవరం మీదుగా రావాడ పంచాయతీ పరిధి సోమునాయుడుపాలెం వరకు రూ.80 లక్షల నాబార్డు నిధులతో బీటీ రహదారి పనులు కొనసాగుతున్నాయి. కాగా ఎండీఆర్‌ నిధులు రూ.4.4 కోట్లతో జాజులవానిపాలెం నుంచి పి.బోనంగి, కలపాక మీదుగా దళాయిపాలెం వరకు బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు రహదారుల పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

చురుగ్గా రహదారి విస్తరణ పనులు

మాకవరపాలెం: మండలంలోని రాచపల్లి నుంచి చౌడువాడ రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన తారు రోడ్డు పనులు చకాచకా సాగుతున్నాయి. మాకవరపాలెం మండలం రాచపల్లి సెంటరు నుంచి కోటవురట్ల మండలం చౌడువాడ వరకు 7.77 కిలోమీటర్లు పొడవున రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం 12 అడుగులు ఉన్న ఈ రోడ్డును 18 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. తొలుత రోడ్డుకు ఇరువైపులా ఆరు అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ పనులు చేస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:40 AM