Share News

గిరి గ్రామాల్లో ఎలుగుబంటి కలకలం

ABN , Publish Date - May 31 , 2026 | 11:16 PM

మండల పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తోంది. రెండు రోజులుగా సంచరిస్తూ గిరిజనులను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు సూచిస్తున్నారు.

గిరి గ్రామాల్లో ఎలుగుబంటి కలకలం
రంగబయలు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం సంచరిస్తున్న ఎలుగుబంటి

రంగబయలు, బరడ పంచాయతీల పరిధిలో సంచారం

గిరిజనుల్లో భయాందోళన

అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన

ముంచంగిపుట్టు, మే 31 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తోంది. రెండు రోజులుగా సంచరిస్తూ గిరిజనులను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు సూచిస్తున్నారు.

మండలంలోని పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామ సమీపంలో శనివారం ఉదయం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. గ్రామ సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న శ్రామికుల వైపు ఎలుగుబంటి రావడంతో భయాందోళనకు గురైన వారు కొంత సమయం తరువాత చాకచక్యంగా దానిని అక్కడ నుంచి తరిమివేశారు. ఆదివారం రంగబయలు, బరడ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో ఆ ఎలుగుబంటి సంచరిస్తూ స్థానికుల కంటపడింది. బరడ పంచాయతీ వండ్రంగుల, సగ్గులు మీదుగా రంగబయలు పంచాయతీ లంగబాపొదర్‌ గ్రామ సమీపంలో కోతకు సిద్ధ్దంగా ఉన్న వరి పంట పొలాల వైపు సంచరిస్తూ స్థానికుల కంటపడింది. భారీగా ఉన్న ఆ ఎలుగుబంటి గత రెండు రోజులుగా మారుమూల గ్రామాల్లో సంచరించడంతో పొలాలకు, ఉపాధి పనులకు వెళ్లాలన్నా, ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా గిరిజనులు జంకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలుగుబంటి దాటి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎలుగుబంటి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దాని బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని పాడేరు డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారిణి(డీఎఫ్‌వో) కె.ఉమామహేశ్వరి సూచించారు. మండలంలోని పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో శనివారం ఎలుగుబంటి హల్‌చల్‌ చేసిన నేపథ్యంలో డీఎఫ్‌వో సిబ్బందితో కలిసి ఆదివారం కడుతులతో పాటు పలు గ్రామాలను సందర్శించారు. గిరిజనులతో సమావేశమై ఎలుగుబంటి బారిన పడకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం అడవి మామిడి, జీడి పనస పంట, పనసపండ్ల దిగుబడి సీజన్‌ కావడంతో ఎలుగుబంట్లు ఆహారం కోసం అడవి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎవరూ కూడా సూర్యోదయానికి ముందు, రాత్రి వేళల్లో పొలాలకు, కొండలవైపు, బయటకు బహిర్భూమికి వెళ్లరాదని సూచించారు. పగటి వేళల్లో బయటకు ఒంటరిగా ఎవరూ వెళ్లరాదని, ఎక్కువ మంది కలిసి వెళ్లాలని సూచించారు. ఎలుగుబంట్లు తారస పడినప్పుడు రెండు చేతులు పైకెత్తి గట్టిగా కేకలు వేస్తూ వెనక్కి పరుగులు తీయాలని తెలిపారు. అలాగే ఒంటరి ఎలుగుబంటి కన్నా పిల్లలతో ఉన్న ఎలుగుబంటితో ఎక్కువ ప్రమాదమని చెప్పారు. ఎలుగుబంటి సంచరిస్తున్న తరుణంలో అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట ముంచంగిపుట్టు ఫారెస్టు అధికారి ఎం.మురళీకృష్ణ, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 31 , 2026 | 11:16 PM