బీచ్ రెస్టారెంట్ల సీజ్
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:37 AM
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెస్టారెంట్లను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసినా...అధికారులు ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారు. తప్పనిసరి స్థితిలో రెండు రెస్టారెంట్లను సోమవారం సీజ్ చేశారు. ఈ తతంగం వెనుక రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బీచ్ రెస్టారెంట్ల సీజ్
విరాగో, శాంక్టమ్‌లకు తాళాలు
కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశాలు
రాజకీయ ఒత్తిళ్లతో సీజ్‌తో సరిపెట్టిన అధికారులు
విశాఖపట్నం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెస్టారెంట్లను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసినా...అధికారులు ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారు. తప్పనిసరి స్థితిలో రెండు రెస్టారెంట్లను సోమవారం సీజ్ చేశారు. ఈ తతంగం వెనుక రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సముద్ర తీరాన్ని ఆనుకొని, కోస్తా నియంత్రణ మండలి పరిధిలో పక్కా నిర్మాణాలు చేపట్టాలంటే ప్రత్యేక అనుమతులు ఉండాలి. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు, నామమాత్రపు అనుమతులతో మరికొందరు నిర్మాణాలు చేపట్టి, వాటిలో రెస్టారెంట్లు, బార్‌లు నడుపుతున్నారు. భీమిలి బీచ్‌లో అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డి తన కుమార్తె పేరిట ఇలాగే నిర్మాణాలు చేపట్టారు. వాటిపై జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై కమిటీ వేసి, అక్రమ నిర్మాణాలు నిజమేనని నిర్ధారించారు. దాంతో వాటిని కూల్చివేయాలని, ఆ ఖర్చు కూడా సాయిరెడ్డి కుమార్తె నుంచే వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించగా, జీవీఎంసీ అధికారులు దానిని అమలు చేశారు. అదేవిధంగా బీచ్‌రోడ్డులో ఐదు రెస్టారెంట్లు నిబంధనలు అతిక్రమించాయంటూ పీతల మూర్తియాదవ్, తెడ్డు శంకర్, గంటా నూకరాజు వేర్వేరుగా కేసులు వేశారు. వాటిపై హైకోర్టు నివేదికలు కోరింది. కమిటీ అన్ని రెస్టారెంట్లను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతులు లేవని తేల్చింది. ఈ నేపథ్యంలో వాటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు గత సెప్టెంబరులోనే ఆదేశించింది. అయితే అవి రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో అధికారులు అప్పట్లో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
ఇటీవల సాయిరెడ్డి నిర్మాణం తొలగింపు కేసులో చర్యలు చేపట్టకుండా జాప్యం చేశారని పేర్కొంటూ ప్రభుత్వం అప్పటి అధికారులకు నోటీసులు జారీ చేసింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఈ నెల 12వ తేదీన హైకోర్టులో రెస్టారెంట్ల కేసు విచారణ ఉంది. వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో కోర్టుకు వివరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, సచివాలయం సిబ్బంది అంతా కలిసి సోమవారం విరాగో, శాంక్టమ్ (తొట్లకొండ) రెస్టారెంట్లకు వెళ్లారు. వాస్తవంగా వాటిని కూలగొట్టాలి. కానీ అధికారులు ఆ పని చేయకుండా గేట్లకు నోటీసులు అంటించి సీజ్ చేశారు. రెండింటిలో ఒకటి జనసేన నాయకుడిది కాగా మరొకటి పర్యాటక శాఖ నుంచి వైసీపీ నాయకులు లీజుకు తీసుకుని నడుపుతున్నారు. సోమవారం అధికారులు శాంక్టమ్‌ను సీజ్ చేయడానికి వెళితే నిర్వాహకులు సంప్రతింపులు జరిపారు. హైకోర్టు ఆదేశం మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పడంతో మిన్నకుండిపోయారు. మిగిలిన మూడు రెస్టారెంట్లపై స్టేటస్ కో ఉన్నందున చర్యలు చేపట్టలేదని అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నామని భీమిలి టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామకృష్ణ తెలిపారు.