Share News

రూ.5 వేల కోట్లతో బీచ్‌ కారిడార్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:04 AM

విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు రూ.5 వేల కోట్లతో బీచ్‌ కారిడార్‌ను నిర్మించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.

రూ.5 వేల కోట్లతో బీచ్‌ కారిడార్‌

త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలు

సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు రూ.5 వేల కోట్లతో బీచ్‌ కారిడార్‌ను నిర్మించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారవుతున్నదన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో సీఐఐ శనివారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే జోన్‌ ఆపరేషన్లు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. జోన్‌కు అవసరమైన 54 ఎకరాల భూమి ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చాకే భూములు ఇచ్చామని, జీఎంను నియమించామని, తాత్కాలిక భవనం కేటాయించామని, సిబ్బంది నియామకానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. అయితే కొత్త జోన్‌లో వాల్తేరు డివిజన్‌ విశాఖపట్నం డివిజన్‌గా మారుతుందని, కొత్తగా ఒడిశాలో రాయగడ డివిజన్‌ వస్తోందన్నారు. వీటికి సంబంధించిన సరిహద్దు అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. సరకు రవాణాకు ఉద్దేశించిన కేకే లైన్‌ను ఏపీలో ఉంచాలని కోరుతున్నారని, అయితే అది సరకు రవాణాకు సంబంధించిన లైన్‌ కాబట్టి విడగొట్టకుండా ఒకటిగా ఉంచాలని రైల్వే శాఖ భావిస్తోందన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 01:04 AM