Share News

రూ.5 కోట్లతో బీచ్‌ పరిశుభ్రత

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:09 AM

బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించే లక్ష్యంతో యంత్రాలతో ఇసుకను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు నిర్వహించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు.

రూ.5 కోట్లతో బీచ్‌ పరిశుభ్రత

ఇసుకలో చెత్త తొలగించేందుకు జీవీఎంసీ టెండర్లు

జీవీఎంసీ యంత్రాలతో ఐదేళ్లపాటు నిర్వహణ

విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించే లక్ష్యంతో యంత్రాలతో ఇసుకను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు నిర్వహించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. నగర పరిధిలోని బీచ్‌లకు వచ్చే సందర్శకులు పానీపూరీ, మురీమిక్చర్‌, ఐస్‌క్రీమ్‌లు, నూడిల్స్‌ వంటి ఆహారపదార్థాలు తిని వ్యర్థాలను ఇసుకలో పడేస్తున్నారు. అలాగే వాటర్‌బాటిళ్లు, కూల్‌డ్రింక్‌లు తాగిన తర్వాత ఖాళీ సీసాలను ఇసుకతిన్నెల్లోనే పడేస్తుండడంతో చెత్తాచెదారంతో నిండిపోతోంది. దీనివల్ల బీచ్‌కు వచ్చే పర్యాటకులు, సందర్శకులు ఇబ్బందిపడుతున్నారు. తీరంలో ఇసుకతిన్నెలపై కూర్చొని సముద్రం అందాలను ఆస్వాదించాలనుకుంటే ఇసుకలో చెత్త కలిసి ఉండడంతో అక్కడ ఉండలేకపోతున్నారు. దీంతో బీచ్‌ ఇసుకలోని చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి ఇసుకను శుభ్రం చేసేందుకు కొన్నాళ్ల కిందట యంత్రాలను ప్రవేశపెట్టారు. రెండేళ్లుగా ఆర్కేబీచ్‌లో రెండు యంత్రాలు పగటిపూట పనిచేస్తుండగా, రాత్రిసమయంలో మరొక యంత్రం పనిచేస్తోంది. వాటి నిర్వహణ గడువు పూర్తవడంతో తాజాగా మూడు యంత్రాల నిర్వహణకు జీవీఎంసీ అధికారులు టెండర్లు పిలిచారు. జీవీఎంసీకి చెందిన యంత్రాలను కాంట్రాక్టర్లు ఐదేళ్లపాటు నిర్వహించాల్సి ఉంటుంది. కోస్టల్‌బ్యాటరీ నుంచి ఆర్కేబీచ్‌ వరకు తీరం వెంబడి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇసుకతిన్నెల్లోని చెత్తను ఏరివేసేందుకు ఐదేళ్లపాటు నిర్వహించేందుకు రూ.1.8 కోట్లు, పెదజాలారిపేట నుంచి అప్పూఘర్‌ వరకు ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చెత్తను ఏరివేసేందుకు రూ.1.8 కోట్లు, వుడాపార్క్‌ నుంచి ఆర్కేబీచ్‌ వరకు మూడేళ్లపాటు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇసుకలోని చెత్తను వేరుచేసేందుకు రూ.1.46కోట్లు వెచ్చించేందుకు ఈనెల ఒకటిన టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 15 వరకు టెండరు దాఖలుకు గడువు ఇచ్చారు.

Updated Date - Jul 06 , 2026 | 01:09 AM