ఎండల పట్ల అప్రమత్తం
ABN , Publish Date - May 21 , 2026 | 11:51 PM
ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు. ఎండల తీవ్రతపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఉపాధి హామీ పనులు చేపడుతున్న వేతనదారులకు ఎండ దెబ్బ తగలకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
- కలెక్టర్ టి.నిషాంతి
పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు. ఎండల తీవ్రతపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఉపాధి హామీ పనులు చేపడుతున్న వేతనదారులకు ఎండ దెబ్బ తగలకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తాజా ఎండలకు అటు ప్రజలు, ఇటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు ప్రజలు గురికాకుండా చూడాలన్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటివి అందుబాటులో ఉండాలని, జనం ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించాలన్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ నిషాంతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, డీఆర్‌వో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ నాగేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, సీపీవో ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.