అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 16 , 2026 | 10:51 PM
మోదకొండమ్మ ఉత్సవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, మే 16(ఆంధ్రజ్యోతి):మోదకొండమ్మ ఉత్సవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. మోదకొండమ్మ ఆలయ ఆవరణలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆదివారం ఆరు గంటలకు ఉత్సవాల ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు. యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఎటువంటి సమస్యలు, శాంతిభద్రతల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. భారీ వాహనాలు, ఇతర వాహన రాకపోకల నియంత్రణకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ఆమె పరిశీలించి, పలు సూచనలు చేశారు. పట్టణంలో కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని, ఊరేగింపులో జనసమూహాలను నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులు నిరంతర వైద్య సేవలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య పనులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీ అమిత్‌బర్దార్, జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏఎస్‌పీ నవజ్యోతిమిశ్రా, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.