చురుగ్గా సర్
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:48 PM
భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపడుతున్న ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకుంది. దీంతో శుక్రవారం నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 80.91 శాతం జరిగింది. జిల్లాలో పెదబయలు మండలం ముందంజలో ఉండగా.. అరకులోయ మండలం వెనుకబడింది.
ఐదు రోజుల్లో 44 శాతం నుంచి 80.91 శాతానికి చేరిక
యంత్రాంగం ప్రత్యేక చర్యలు, పర్యవేక్షణే కారణం
యుద్ధప్రాతిపదికన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్
ముందంజలో పెదబయలు మండలం
వెనుకబడిన అరకులోయ..
పాడేరు, జూలై 10(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ఊపందుకుంది. జూన్ 15న మొదలైన ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఈనెల 14వ తేదీ నాటికి ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే ఏజెన్సీలోని ప్రతికూల పరిస్థితులతో ఐదు రోజుల క్రితం వరకు కేవలం 44 శాతం మాత్రమే సర్ ప్రక్రియ పూర్తయింది. దీంతో సర్ వేగవంతానికి జిల్లా కలెక్టర్ నిషాంతి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సచివాలయాలను నిరంతరం తెరిచి ఉంచి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను చేపట్టేలా ఏర్పాటు చేశారు. దీంతో గత ఐదు రోజులుగా జిల్లాలోని వైద్యారోగ్య, పోలీస్ శాఖలు మినహా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సర్ పనుల్లోనే నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, డీఆర్‌వో లోకేశ్వరరావు పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను అప్రమత్తం చేశారు. దీంతో వారంతా రేయింబవళ్లు ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం సర్ ప్రక్రియ వేగవంతం కావడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. దీంతో జిల్లాలో శుక్రవారం నాటికి 80.91 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. జిల్లాలో పెదబయలు మండలంలో అత్యధికంగా 96.72 శాతం ఫారాల డిజిటలైజేషన్ కాగా, అత్యల్పంగా అరకులోయ మండలంలో 72.88 శాతం ఫారాల డిజిటలైజేషన్ జరిగింది.
జిల్లాలో శుక్రవారం నాటికి జరిగిన ఎస్‌ఐఆర్ వివరాలు
వ.సం. మండలం మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ జరిగినవి
-----------------------------------------------------------------------------------
1. ముంచంగిపుట్టు 39,041 30,949
2. పెదబయలు 43,408 41,984
3. హుకుంపేట 45,871 37,303
4. డుంబ్రిగుడ 38,879 31,670
5. అరకులోయ 43,002 31,340
6. అనంతగిరి 38,464 30,712
7. జీకేవీధి 52,515 41,552
8. కొయ్యూరు 43,755 37,874
9. చింతపల్లి 65,462 50,208
10. జి.మాడుగుల 44,808 35,757
11. పాడేరు 44,547 34,995
--------------------------------------------------------------------------------------
మొత్తం 4,99,752 4,04,344 (80.91 శాతం)
--------------------------------------------------------------------------------------