Share News

అద్దె ఇళ్లల్లో బీసీ వసతిగృహాలు

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:53 AM

అద్దె ఇళ్లల్లో బీసీ వసతిగృహాలు

అద్దె ఇళ్లల్లో బీసీ వసతిగృహాలు
రావికమతం మండలం కొత్తకోటలో ఎస్సీ బాలుర వసతిగృహం భవనం శ్లాబ్‌తోపాటు గోడలు పెచ్చులు సైతం ఊడిపోయి పాచిపట్టిన గోడలు

అద్దె ఇళ్లల్లో బీసీ వసతిగృహాలు

అరకొర సదుపాయాలతో విద్యార్థుల పాట్లు

చోడవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): చోడవరం మండలంలో ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఎనిమిది సంక్షేమ వసతిగృహాలు వున్నాయి. సాంఘిక సంక్షేమ (ఎస్సీ) శాఖకు చెందిన రెండు వసతిగృహాలకు సొంత భవనాలు వుండగా, బీసీ విద్యార్థుల ఆరు వసతిగృహాల్లో నాలుగు చాలీచాలని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కో-ఆపరేటివ్‌ కాలనీలో అద్దె భవనంలో నడుస్తున్న బీసీ వసతిగృహంలో 118 మంది విద్యార్థులకు ఉన్నారు. వీరంతా మూడు గదుల్లో సర్దుకోవాల్సి వస్తున్నది. పెదబజారు వీధిలో పోస్టు మెట్రిక్‌ (కళాశాల) బాలికల హాస్టల్‌ ఇరుకు భవనంలో నడుస్తున్నది. ఇక్కడ మొత్తం 120 మంది విద్యార్థినులు వున్నారు. బీసీ పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల కోసం కొత్తూరు జంక్షన్‌ శివారున రెండు గదుల అద్దె భవనంలో వసతిగృహం నడుస్తున్నది. ఇందులో 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. మండలంలోని గోవాడలో బీసీ బాలుర వసతిగృహం గతంలో అద్దె భవనంలో నడిచేది. అది కారిపోతుండడంతో సమీపంలోని ప్రాథమిక పాఠశాలలోకి మార్చారు. గోవాడలో గతంలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ నిర్వహించిన భవనాన్ని బీసీ సంక్షేమ శాఖకు కేటాయించడంతో అందులో పోస్టు మెట్రిక్‌ విద్యార్థినులకు వసతి కల్పించారు. ఎస్సీ విద్యార్థులకు చీడికాడ రోడ్డులో, గాంధీగ్రామం సిటిజన్‌ కాలనీలో వసతిగృహాలు వున్నాయి. ఇవి సొంత భవనాలే అయినప్పటికీ సౌకర్యాలు లేవు. మొత్తం అన్ని హాస్టళ్లలో మంచాలు లేకపోవడంతో విద్యార్థులు గచ్చుపైనే నిద్రించాల్సి వస్తున్నది. మొత్తం మీద అద్దె భవనాల్లో నడుస్తున్న వసతిగృహాల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు చాలకపోగా, సొంత భవనాలు ఉన్న వసతిగృహాల్లో అధ్వానంగా వున్నాయి.

మరమ్మతులు లేవు.. విద్యార్థులకు రక్షణ లేదు..

రోలుగుంట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రోలుగుంటలోని బీసీ బాలుర వసతిగృహంలో ప్రస్తుతం 82 మంది విద్యార్థులు వున్నారు. భవనం శిఽథిలావస్థకు చేరింది. మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఆమోదం లభించలేదు. గదుల్లో శ్లాబ్‌ పెచ్చులు ఊడుతున్నాయి. కొన్ని తలుపులు, కిటికీలకు రెక్కలు లేకపోవడంతో వర్షం కురిస్తే లోపలికి నీరు పడుతున్నది. కొన్ని గదుల్లో విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

దిబ్బిడిలో శిథిల భవనం..

బుచ్చెయ్యపేట, జూలై 26 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని దిబ్బిడిలో బీసీ బాలుర వసతిగృహం భవనం శిథిలావస్థకు చేరింది. మొత్తం 83 మంది విద్యార్థులు వుంటున్న ఈ భవనం శ్లాబ్‌ నుంచి అప్పుడప్పుడు పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షం కురిస్తే శ్లాబ్‌ నుంచి చుక్కలు కారుతున్నాయి. గోడలు బీటలు వారి, సిమెంట్‌ పెచ్చులు ఊడుతున్నాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ పనిచేయడంలేదు. వడ్డాదిలో బీసీ బాలుర వసతి గృహం మూడు గదులు వున్న అద్దె భవనంలో నడుస్తున్నది. దీంతో ఒక్కో గదిలో పది మంది చొప్పున విద్యార్థులు, సామన్లతో సహా వుండాల్సి వస్తున్నది. గదులు ఇరుకుగా వుండడంతో ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:53 AM