బాక్సైట్ జోలికొస్తే ఖబడ్డార్
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:04 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జర్రెల అడవుల్లో నిక్షిప్తమై ఉన్న బాక్సైట్ జోలికొస్తే ఊరుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు.
రహస్య సర్వేలను తక్షణమే నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ని రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
గూడెంకొత్తవీధి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జర్రెల అడవుల్లో నిక్షిప్తమై ఉన్న బాక్సైట్ జోలికొస్తే ఊరుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ శనివారం జర్రెల కొండపై పార్టీ ఆధ్వర్యంలో సభను ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో గల బాక్సైట్ నిక్షేపాలపై సర్వే చేపట్టే బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు జర్రెల వచ్చి మట్టి నమూనాలను సేకరించేందుకు యత్నించారన్నారు. గిరిజనులు గమనించి ప్రైవేటు కంపెనీ ప్రతినిధులను అడ్డుకోవడంతో ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందన్నారు. తమకు సమాచారం లేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం ఆదివాసీలను ఆందోళనకు గురిచేసిందన్నారు. ఐదో షెడ్యుల్డ్ ప్రాంతంలో నిక్షేపాలను నేరుగా వెలికితీసే హక్కులేదన్నారు. సర్వ అధికారులు ఆదివాసీలకు మాత్రమే ఉంటాయన్నారు. బాక్సైట్ తవ్వకాలను ఆదివాసీలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుమతుల జీవోలను రద్దు చేశాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ రద్దు చేయలేదన్నారు. ఈ గెజిట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలని యత్నిస్తుందన్నారు. దీనిని ఆదివాసీలు తిప్పికొట్టాలన్నారు. బాక్సైట్ తవ్వకాలు నిర్వహించేది లేదని ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, చట్టాల కోసం పదవులను సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు చట్ట సభలకు వెళ్లి ఆదివాసీల గొంతు వినిపించాలన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కాపాడేందుకు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కృషిచేయాలన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరపబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.సురేంద్ర, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ధర్మన్నపడాల్, బాల్‌దేవ్, స్థానిక నాయకులు పాంగి ధనుంజయ్, అంపురంగి బుజ్జిబాబు, గుడూరి సత్యనారాయణ, ఐదు పంచాయతీల ఆదివాసీలు పాల్గొన్నారు.