Share News

పెదమదీనలో రణరంగం

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:41 AM

మండలంలోని పెదమదీన గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అకేసియా చెట్ల నరికివేతపై తెలుగుదేశం, జనసేన పార్టీల శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి కొట్లాటకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి పికెట్‌ ఏర్పాటు చేశారు.

పెదమదీనలో రణరంగం
పెదమదీనలో కర్రలతో పరస్పరం దాడులు చేసుకుంటున్న జనసేన, టీడీపీ శ్రేణులు

జనసేన, టీడీపీ శ్రేణులు బాహాబాహీ

రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు

నలుగురికి గాయాలు

ప్రభుత్వ భూమిలో అకేసియా చెట్ల నరికివేతపై వివాదం

రచ్చబండ వద్ద సమావేశంలో మొదలైన గొడవ

గ్రామంలో పోలీసు పికెట్‌

ఇరుపార్టీల నేతలకు డీఎస్పీ కౌన్సెలింగ్‌

బుచ్చెయ్యపేట, జనవరి 20 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని పెదమదీన గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అకేసియా చెట్ల నరికివేతపై తెలుగుదేశం, జనసేన పార్టీల శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి కొట్లాటకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి పికెట్‌ ఏర్పాటు చేశారు.

పెదమదీన రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 81లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమి వుంది. సామాజిక అటవీ శాఖ అధికారులు సుమారు 15 సంవత్సరాల క్రితం ఈ భూమిలో అకేసియా మొక్కలు నాటించారు. వీటి పరిరక్షణ బాధ్యతను వన సంరక్షణ సమితికి అప్పగించారు. అకేసియా చెట్లు ఇప్పుడు ఏపుగా పెరగడంతో అటవీ శాఖ అధికారులు వీటిని పంచాయతీకి అప్పగించారు. చెట్లను నరికివేయించి, వాటినికి విక్రయించగా వచ్చిన సొమ్ముతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. దీంతో పది రోజుల క్రితం జనసేన పార్టీకి చెందిన సర్పంచ్‌ వర్గీయులు (సర్పంచ్‌ గతంలో వైసీపీ. ఎన్నికల తరువాత జనసేలో చేరారు) కూలీలను పురమాయించి అకేసియా చెట్లను నరికివేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకుడు వియ్యపు అప్పారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దారు లక్ష్మి ఆదేశాలతో పోలీసులు వచ్చి చెట్ల నరికివేతను అడ్డుకొన్నారు. బహిరంగ వేలం నిర్వహించిన తరువాతే చెట్లను నరికి, వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి వినియోగించాలని టీడీపీ నేత అప్పారావు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో అకేసియా చెట్ల నరికివేత గురించి చర్చించడానికి మంగళవారం గ్రామపెద్దలు, ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రచ్చబండ వద్ద సమావేశమయ్యారు. అకేసియా చెట్లను నరికివేయించాలని జనసేన శ్రేణులు ప్రతిపాదించగా, వద్దని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు. చెట్లను నరికి, వచ్చిన ఆదాయంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని జనసేన నేతలు చెప్పగా.. చెట్లను నరికిన తరువాత ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని, అందువల్ల చెట్లను నరకడానికి వీలులేదని టీడీపీ వర్గీయులు స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట, కొట్లాటకు దారితీసింది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చి, ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గాయపడిన వారికి పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించి అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరు వియ్యపు దేవి, వియ్యపు చిరంజీవి, వియ్యపు రాము, ఆవాలు ఆప్పారావుగా గ్రామస్థులు చెబుతున్నారు. అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు బుచ్చెయ్యపేట పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పెదమదీన గ్రామానికి చెందిన ఇరువర్గాల వారిని పోలీసు స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి గొడవపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 21 , 2026 | 12:41 AM