Share News

కాఫీ బెర్రీ బోరర్‌పై సమరం!

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:15 PM

మన్యంలో కాఫీ బెర్రీ బోరర్‌ కీటకాన్ని నియంత్రించేందుకు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కీటకాన్ని తొలిదశలోనే గుర్తించేందుకు యాభై ప్రత్యేక బృందాలతో కాఫీ తోటల్లో సర్వే చేపడుతున్నారు.

కాఫీ బెర్రీ బోరర్‌పై సమరం!
చినలబుడు పంచాయతీ పరిధిలో సర్వే చేస్తున్న కాఫీ ఏడీ అయింతి, కాఫీ బోర్డు అధికారులు

ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించిన జిల్లా అధికారులు

50 బృందాలతో కాఫీ తోటల్లో సర్వే

చినలబుడు పంచాయతీలోని ఐదు గ్రామాల్లో తెగులు ఉన్నట్టు తాజాగా నిర్ధారణ

నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు

చింతపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కాఫీ బెర్రీ బోరర్‌ కీటకాన్ని నియంత్రించేందుకు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కీటకాన్ని తొలిదశలోనే గుర్తించేందుకు యాభై ప్రత్యేక బృందాలతో కాఫీ తోటల్లో సర్వే చేపడుతున్నారు. అరకులోయ మండలం చినలబుడు పంచాయతీలో ఐదు గ్రామాల్లో బెర్రీ బోరర్‌ కీటకాన్ని అధికారులు తాజాగా గుర్తించారు. కీటకం విస్తరించకుండా నివారణ చర్యలు ముమ్మరం చేశారు.

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మన్యం(అరకు)కాఫీని బెర్రీ బోరర్‌ కీటకం ఆశించింది. గిరిజన ప్రాంతంలో తొలిసారిగా 2025లో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు బయటపడింది. ఈ తెగులు వ్యాప్తి చెందితే కాఫీ తోటలు నాశనమైపోతాయని ముందుగానే పసిగట్టిన కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యానశాఖ, ఐటీడీఏ అధికారులు అప్పట్లో యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు గుర్తించేందుకు రెండు నెలల పాటు ప్రత్యేక సర్వే చేశారు. అరకులోయ, డుంబ్రిగుడ మండలాలు, చింతపల్లి హెచ్‌ఆర్‌యూలో 1,950 ఎకరాల్లో బెర్రీ బోర్‌ కీటకం ఆశించినట్టు అధికారులు గుర్తించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కీటకం వ్యాప్తి చెందకుండా రెండు నెలల పాటు కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు, జిల్లా ఉద్యానశాఖ అధికారులు, క్షేత్ర స్థాయి ఉద్యోగులతో పాటు వెంకటరామన్నగూడెం శాస్త్రవేత్తలు శ్రమించి అదుపు చేశారు. ఈ కీటకం రైతుల ఆదాయాన్ని భారీగా దెబ్బతీసింది. తాత్కాలికంగా బెర్రీ బోరర్‌ని నియంత్రించినా శాశ్వత నివారణ సాధ్యంకాదని, కనీసం ఐదేళ్లపాటు నిరంతర నియంత్రణ చర్యలు చేపడితేనే తప్పా ఆశించిన నిర్మూలన సాధ్యంకాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కాఫీ బెర్రీ బోరర్‌ అంటే..?

ప్రపంచ వ్యాప్తంగా కాఫీ పంటను తీవ్ర స్థాయిలో నాశనం చేసే తెగులు కాఫీ బెర్రీ బోరర్‌(హైపోథెనెమస్‌). కాఫీ బెర్రీ బోరర్‌ అనే కీటకం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. 2000లో ఈ తెగులును హవాయిలో గుర్తించారు. ఈ కీటకం కాఫీ కాయ, పండులో రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశిస్తుంది. కాఫీ పండు, కాయలో ఉన్న గింజను పూర్తిగా తొలిచివేసి సొరంగం మాదిరిగా చేసుకుని గుడ్లు పెడుతుంది. ఒక కీటకం 50కిపైగా కాఫీ కాయ, పండు లోపల ఏర్పాటు చేసుకున్న సొరంగంలో గుడ్లు పెడుతుంది. 35 రోజులకు ఒక గింజ నుంచి 30-40 కీటకాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చిన కీటకాలు ఇతర కాఫీ కాయల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పద్ధతిలో కాఫీ తోటల్లో ఉన్న కాయలు, పండ్లను కీటకాలు పూర్తిగా నాశనం చేస్తాయి. దీంతో కాఫీ దిగుబడి పూర్తిగా పడిపోతుంది. కాయలు, పండ్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం వల్ల కాఫీ బెర్రీ బోరర్‌ కీటకాలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి. ఈ తెగులు అత్యంత ప్రమాదకరం, కాఫీ తోటల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది.

గిరిజన ప్రాంతంలో ప్రప్రథమం

పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధి అరకులోయ చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో 2025 ఆగస్టులో ప్రప్రథమంగా కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి చెందినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పకనకుడి గ్రామంలోని సిరగం సువర్ణకు చెందిన ఎకరం కాఫీ తోటలో గింజలకు కాఫీ బెర్రీ బోరర్‌ తెగులు కనిపించింది. పకనకుడి గ్రామంతో పాటు పరిసర మాలిసింగరం, మాలివలస, తుర్రయిగూడు, మంజగూడలోనూ కొన్ని మొక్కల్లో ఈ తెగులు అధికంగా కనిపించింది. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో 1,950 ఎకరాల్లో ఈ తెగులను అప్పట్లో గుర్తించారు.

ముందుగానే నివారణ చర్యలు ప్రారంభం

గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కాఫీ బెర్రీ బోరర్‌ కీటకాన్ని నియంత్రించేందుకు జిల్లా అధికారులు ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించారు. కలెక్టర్‌ నిషాంతి జిల్లా అధికారులతో సమావేశమై కేంద్ర కాఫీ బోర్డు, జిల్లా ఉద్యానశాఖ, ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు అధికారులతో పాటు వెలుగు స్వయం సహాయక సంఘాల సభ్యులతో 50 బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేపడుతున్నారు. ప్రస్తుతం అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో సర్వే జరుగుతోంది. అరకులోయ మండలం చినలబుడు పంచాయతీలో ఐదు గ్రామాల్లో బెర్రీ బోరర్‌ కీటకాన్ని అధికారులు తాజాగా గుర్తించారు. ఆ తోటల్లో కాఫీ కాయలను వెంటనే సేకరించి వేడి నీళ్లలో ముంచి కీటకాలను నాశనం చేస్తున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:15 PM