Share News

మ్యూజియంగా బంగ్లాదేశ్‌ నౌక

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:02 AM

బంగ్లాదేశ్‌ కార్గో నౌక ‘ఎంవీ మా’ త్వరలో మ్యూజియంగా పర్యాటకులకు కనువిందు చేయనుంది.

మ్యూజియంగా బంగ్లాదేశ్‌ నౌక

ఉత్సవ్‌ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నం

సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ

ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఆలోచనకు స్వస్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బంగ్లాదేశ్‌ కార్గో నౌక ‘ఎంవీ మా’ త్వరలో మ్యూజియంగా పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఐఎన్‌ఎస్‌ కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142 యుద్ధ విమానం, యుహెచ్‌-3హెచ్‌, సీ హ్యారియర్‌ హెలికాప్టర్లను ఎలాగైతే మ్యూజియాలుగా మార్చి, సందర్శకులను చూడడానికి అనుమతిస్తున్నారనే కార్గో నౌక ఎంవీ మాను కూడా ఆ విధంగానే సందర్శనీయ ప్రాంతంగా మారుస్తున్నారు. ప్రస్తుతం దానికి రంగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే విశాఖ ఉత్సవ్‌ నాటికి దానిని సిద్ధం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌కు చెందిన ఈ నౌక ఆరేళ్ల క్రితం తుఫాన్‌ గాలులకు విశాఖపట్నం పోర్టు నుంచి తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దానిని మళ్లీ వెనక్కి తీసుకువెళ్లే అవకాశం లేదని గుర్తించిన నౌక యాజమాన్యం ‘గిల్‌మెన్‌’ అనే సంస్థకు దానిని అప్పగించేసింది. ఈ నౌకను తీసుకుని దానిపై ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఏపీ పర్యాటక శాఖ ప్రయత్నం చేసింది. ఒప్పందాలు కూడా చేసుకుంది. దీనిని రెండు దశలుగా అభివృద్ధి చేయాలని అప్పుడు ప్రణాళిక రూపొందించింది. తొలుత సందర్శకులు వచ్చి చూసేలా మ్యూజియంలా మార్చాలని, రెండో దశలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ పెట్టాలని భావించింది. నౌక కోస్తా నియంత్రణ మండలి పరిధి (సీఆర్‌జెడ్‌)లో ఉందని, అటవీ శాఖ అనుమతులు అవసరమని తేల్చారు. వాటి కోసం యత్నించారు. కానీ ఏదీ సఫలం కాలేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అనుమతులు ఏవీ రాలేదు. దాంతో ఆ నౌకను ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి మార్పులు చేయకుండా మ్యూజియంగా మార్చి అందుబాటులోకి తేవాలని నిర్వాహకులు నిర్ణయించారు. రంగులు వేసి అలంకరిస్తున్నారు.

చూడడానికి ఏమి ఉంటుందంటే..?

ఎంవీ మా సరకు రవాణా చేసే కార్గో షిప్‌. అందులో సరకు ఎక్కడ నిల్వ చేస్తారు?, దానిని ఎలా దించుతారు?, నౌక కెప్టెన్‌ ఎక్కడ ఉంటారు?...వారి కేబిన్‌, అందులో ఇంజిన్‌. షిప్‌ క్రూ. వారు ఎక్కడ వంట చేసుకుంటారు?, నౌక ప్రొఫెల్లర్‌...ఇలాంటివన్నీ సందర్శకులకు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నేవీ సబ్‌మెరైన్‌, విమానం ఎలా ఆసక్తికరంగా ఉంటాయో...ఇది కూడా అలాగే ఉంటుందని, చివరిలో నౌక పైకి (డెక్‌) ఎక్కి సముద్రం చూసేందుకు అవకాశం కూడా కల్పిస్తామని చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే విశాఖ వచ్చే పర్యాటకులకు అదనపు ఆకర్షణ అవుతుంది.

కైలాసగిరిపై మరో రహదారి

రూ.3 కోట్లతో తెలుగు మ్యూజియం

వరకూ నిర్మాణం

పార్కింగ్‌ సమస్యకూ పరిష్కారం

త్వరలో రెండో ఘాట్‌ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కైలాసగిరిపై మరో రహదారి నిర్మించేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిద్ధమైంది. సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో 800 మీటర్ల పొడవున రోడ్డు పనులు ప్రారంభించింది. కొండపై ఆ చివరనున్న తెలుగు మ్యూజియానికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉండాలని ఆరేళ్ల క్రితం రోప్‌ వే ల్యాండింగ్‌ ప్రాంతం నుంచి కొండవారగా (కైలాసగిరి ఇంగ్లీష్‌ అక్షరాలు పక్క నుంచి) ఒక రహదారి నిర్మాణం చేపట్టారు. ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అది మళ్లీ తుప్పలతో నిండిపోయింది. ఇటీవల కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి, స్కై సైక్లింగ్‌, త్రిశూల్‌ వంటివి ఏర్పాటుచేయడంతో సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. వారాంతాల్లో కిక్కిరిసిపోతోంది. వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్‌ స్థలం ఉండడం లేదు. కైలాసగిరిపై పార్కింగ్‌ ఏరియా వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. కొండపై తిరగడానికి ఒప్పుకోరు. దీంతో ఆ చివరనున్న తెలుగు మ్యూజియానికి నడుచుకుంటూ వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గతంలో సర్క్యులర్‌ ట్రైన్‌ ఉండేది. అది పాడుబడడంతో ఆపేశారు. వీటన్నింటి నేపథ్యంలో తెలుగు మ్యూజియానికి సందర్శకులను పెంచాలంటే...అక్కడకు వాహనాలు వెళ్లడానికి ప్రత్యేక మార్గం అవసరమని నిర్ధారణకు వచ్చి, పాత రహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఆ మార్గం కొత్తగా నిర్మించిన సైన్స్‌ మ్యూజియం వద్ద కలుస్తుంది. అక్కడ వాహనాలు నిలుపుకోవడానికి రెండు వైపులా పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు. దీనివల్ల తెలుగు, సైన్స్‌ మ్యూజియాలు, అదేవిధంగా గ్లాస్‌ బ్రిడ్జి వంటి ప్రాంతాలకు వాహనాల్లో వెళ్లడానికి అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. వీలు చూసుకొని కొండ పైనుంచి వాహనాలు దిగడానికి మరో ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి కూడా సర్వే చేయనున్నామని వీఎంఆర్‌డీఏ సీఈ వినయ్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’ తెలిపారు. దీనికి ఎక్కువ నిధులు అవసరమని, బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు.


దువ్వాడ మీదుగా సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం దువ్వాడ మీదుగా సికింద్రాబాద్‌-పార్వతీపురం, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నామని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-పార్వతీపురం ప్రత్యేక రైలు (07009) డిసెంబరు 23 నుంచి జనవరి 27 వరకు బుధవారం రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పార్వతీపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07010) డిసెంబరు 24 నుంచి జనవరి 28 వరకు ప్రతి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు (07115) జనవరి 7, 9, 16 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.40 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ప్రత్యేక రైలు (07116) జనవరి 8, 10, 17 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుతుందని తెలిపారు.

Updated Date - Nov 25 , 2026 | 01:02 AM