పేదల కాలనీల్లో పందికొక్కులు
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:50 AM
మండలంలో మహా విశాఖ నగరపాలక సంస్థ 88వ వార్డు పరిధిలోని గంగవరం సెంటు స్థలాల ఇళ్ల కాలనీలో గ్రావెల్ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఇటీవల వరకు కాలనీని ఆనుకొని వున్న ఖాళీ స్థలాల్లో గ్రావెల్ తవ్వుకుపోయిన అక్రమార్కులు.. కొద్ది రోజుల నుంచి ఏకంగా కాలనీలో రహదారులను తవ్వేస్తున్నారు. రెండు వైపులా ఇళ్ల పునాదుల వరకు ఆరు నుంచి ఎనిమిది అడుగుల లోతున గ్రావెల్ తవ్వేయడంతో ఆయా రహదారులు క్వారీలను తలపిస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో మట్టి కోతకు గురై ఇళ్లు కూలిపోయే ప్రమాదం వుంది.
గంగవరంలో యథేచ్ఛగా గ్రావెల్, మట్టి తవ్వకాలు
ఖాళీ స్థలాలు అయిపోవడంతో రహదారులపై కన్నేసిన అక్రమార్కులు
ఇళ్ల పునాదుల వరకు రోడ్లను తవ్వేస్తున్న వైనం
6-8 అడుగుల లోతున గోతులు
పేదల ఇళ్లకు పొంచిఉన్న ముప్పు
తమ పరిధి కాదంటున్న రెవెన్యూ శాఖ
పట్టించుకోని వీఎంఆర్‌డీఏ అధికారులు
సబ్బవరం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో మహా విశాఖ నగరపాలక సంస్థ 88వ వార్డు పరిధిలోని గంగవరం సెంటు స్థలాల ఇళ్ల కాలనీలో గ్రావెల్ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఇటీవల వరకు కాలనీని ఆనుకొని వున్న ఖాళీ స్థలాల్లో గ్రావెల్ తవ్వుకుపోయిన అక్రమార్కులు.. కొద్ది రోజుల నుంచి ఏకంగా కాలనీలో రహదారులను తవ్వేస్తున్నారు. రెండు వైపులా ఇళ్ల పునాదుల వరకు ఆరు నుంచి ఎనిమిది అడుగుల లోతున గ్రావెల్ తవ్వేయడంతో ఆయా రహదారులు క్వారీలను తలపిస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో మట్టి కోతకు గురై ఇళ్లు కూలిపోయే ప్రమాదం వుంది.
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో సొంత ఇళ్లు లేని పేదల కోసం గత ప్రభుత్వం సబ్బవరం మండలం గంగవరం, నంగినారపాడు గ్రామాల పరిధిలోని పలు సర్వే నంబర్లలో భూములను గుర్తించింది. ఒక్కో లబ్ధిదారునికి సెంటు చొప్పున స్థలం కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను వీఎంఆర్‌డీఏకు అప్పగించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆయా భూములను వీఎంఆర్‌డీఏకు బదలాయించడంతో లేఅవుట్ వేశారు. ఏడు వేల పైచిలుకు లబ్ధిదారులకు ఇక్కడ స్థలాలను కేటాయించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం వుంటున్న లబ్ధిదారులు ఇంత దూరం వచ్చి ఇళ్లు నిర్మించుకోవడం కష్టమన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ విషయం అలా వుంచితే.. ఇళ్ల కాలనీ లేఅవుట్ వేయగా పలుచోట్ల ఖాళీ స్థలాలు మిగిలాయి. ఇంకా ప్రజావసరాల కోసం.. అంటే పార్కులు, సామాజిక భవనాల నిర్మాణం వంటివాటి కోసం అక్కడక్కడ ఖాళీ స్థలాలను వదిలారు. ఈ ప్రాంతమంతా ఎర్ర గరప నేలలు కావడంతో నాణ్యమైన గ్రావెల్, ఎర్రమట్టి పుష్కలంగా వుంది. అక్రమార్కుల కన్ను ఈ ఖాళీ స్థలాలపై పడింది. నాడు అధికారంలో వున్న వైసీపీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరిపారు. తమ శాఖ పరిధిలో లేదంటూ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం, సాయంత్రం తరువాత వీఎంఆర్‌డీఏకు సంబంధించి ఎవరూ ఇక్కడ వుండకపోవడం అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఎక్స్‌కవేటర్లతో భారీ ఎత్తున గ్రావెల్ తవ్వి, డంపర్ లారీల్లో దువ్వాడ, కూర్మన్నపాలెం, గాజువాక, తదితర ప్రాంతాలకు తరలించారు. దీంతో కాలనీ లోపల, చుట్టూ పది నుంచి పదిహేను అడుగుల లోతున క్వారీల తరహాలో గోతులు ఏర్పడ్డాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు ఆగలేదు. పైగా మరింత ఎక్కువ అయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం వీఎంఆర్‌డీఏ అధికారులు పట్టించుకోకపోవడమేనని స్థానికులు అంటున్నారు. అప్పట్లో వైసీపీ నాయకులు గ్రావెల్ దందా సాగించగా, ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీకి చెందిన నాయకులు గావెల్ తవ్వకాలు జరుపుతున్నారని చెబుతున్నారు. కాలనీ చుట్టూ ఖాళీ స్థలాలన్నింటినీ తవ్వేసిన అక్రమార్కులు.. ఇప్పుడు కాలనీలో రహదారులపై కన్నేశారు. అత్యంత దారుణంగా ఎక్స్‌కవేటర్లతో ఇళ్ల ముందు రోడ్లను ఆరు నుంచి ఎనిమిది అడుగుల లోతు మేర తవ్వేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఇళ్ల పునాదులను ఆనుకొని మట్టి కోతకు గురై, ఇళ్లు కూలిపోయే ప్రమాదం వుంది. ఈ కాలనీ భూమితో రెవెన్యూకు సంబంధం లేకపోవడం, వీఎంఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా గ్రావెల్, మట్టి తవ్వుకుపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తరువాత లబ్ధిదారులు రాకపోకలు ఎలా సాగిస్తారో అర్థం కాని విధంగా ఇక్కడ పరిస్థితి వుంది. గ్రావెల్, మట్టిన తవ్వకాలతో ఏర్పడి భారీ గోతులను తిరిగి కప్పి, రహదారులు నిర్మించడం వీఎంఆర్‌డీఏకు సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.
గంగవరంలో తవ్వకాలు.. దువ్వాడలో స్టాక్ పాయింట్లు
గంగవరంలోని సెంటు స్థలాల కాలనీలో రాత్రిపూట గ్రావెల్, మట్టి తవ్వకాలు జరిపి డంపర్ లారీల్లో దువ్వాడ, సంధ్యానగర్ కాలనీల చుట్టుపక్కల ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి గాజువాక, కూర్మన్నపాలెం, తదితర ప్రాంతాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దువ్వాడ మీదుగా రాత్రిపూట పదుల సంఖ్యలో డంపర్ లారీలు గ్రావెల్, మట్టి లోడుతో రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకందారులకు సొంతంగా 10 వరకు ఎక్స్‌కవేటర్లు, 25కు పైగా లారీలు, డంపర్లు వున్నట్టు తెలిసింది.