బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:12 PM
షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉపాధ్యాయ నియమాకాల్లో గిరిజనులకు శత శాతం రిజర్వేషన్ కల్పించాలని, 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలనే డిమాండ్‌తో గిరిజన సంఘాలు తలపెట్టిన మన్యం బంద్ జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసింది.
జీవో-3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్
స్వచ్ఛందంగా బంద్‌ను పాటించిన గిరిజనులు
దుకాణాలు మూసివేత
పర్యాటక ప్రాంతాలు వెలవెల
పాడేరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉపాధ్యాయ నియమాకాల్లో గిరిజనులకు శత శాతం రిజర్వేషన్ కల్పించాలని, 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలనే డిమాండ్‌తో గిరిజన సంఘాలు తలపెట్టిన మన్యం బంద్ జిల్లాలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. మన్యం బంద్‌కు వైసీపీకి చెందిన జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మద్దతుగా నిలిచారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాలతోపాటు పలు గిరిజన పల్లెల్లో సైతం గిరిజనులు నిరసనను తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులో శనివారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే గిరిజన సంఘం నేతలు పి.అప్పలనర్స, కె.రాధాకృష్ణ, తదితరులు రోడ్లపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. అరకులోయలో నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు జీవో-3 పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌టీసీ డిపో నుంచి బయటకు వెళుతున్న బస్సులను ఆందోళనకారులు ఆపేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా పక్కకు లాగేసి బస్సులను పంపించారు. ఈక్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. అలాగే అరకులోయలో గిరిజన సంఘం నేతలు పొద్దు బాల్‌దేవ్, కె.రామారావు, ఉమామహేశ్వరరావు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, నిరుద్యోగులు బంద్‌ను పాటించారు. చింతపల్లిలో సీపీఎం నేత బి.చిన్నయ్యపడాల్, తదితరులు బంద్‌ను పాటించారు.
బంద్‌తో స్తంభించిన ఏజెన్సీ ప్రాంతం
మన్యం బంద్ సందర్భంగా స్థానిక ఆర్‌టీసీ డిపో నుంచి కొన్ని బస్సులు రోడ్డెక్కినప్పటికీ, ప్రైవేటు జీపులు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిపేశారు. జిల్లా కేంద్రం పాడేరులో దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రైవేటు సంస్థలు మూతపడగా, రెండో శనివారం కావడంతో ప్రభుత్వ సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. జనం సైతం ఇళ్లకే పరిమితం కావడంతో పాడేరులోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే స్థానిక అంబేడ్కర్ కూడలి, మెయిన్ రోడ్లు బోసిపోయాయి. బ్యాంకులు తెరచుకోలేదు. శనివారం ముంచంగిపుట్టు, హుకుంపేటలోని వారపు సంతలు, పర్యాటక కేంద్రం అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, అనంతగిరి మండలం బొర్రాలోని గుహలు వెలవెలబోయాయి.