‘పారాక్వాట్’పై నిషేధం
ABN , Publish Date - May 26 , 2026 | 12:44 AM
కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ‘పారాక్వాట్ డైక్లోరైడ్ 24 ఎస్‌ఎల్’ను రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
అమ్మకాలు నిలిపివేతకు వ్యవసాయ శాఖ అధికారుల ఆదేశాలు
ఎవరైనా ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ‘పారాక్వాట్ డైక్లోరైడ్ 24 ఎస్‌ఎల్’ను రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ మందు అమ్మకాలు నిలిపివేయాలని ఎరువుల డీలర్లను వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశిస్తూ, తక్షణమే దుకాణాల్లో ఉన్న నిల్వల వివరాలు పంపాలని స్పష్టంచేశారు. పారాక్వాట్ అత్యంత విషపూరితమైనది కావడంతో కొంతమంది ఆత్మహత్యకు ఈ మందును తీసుకుంటున్నట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో నిషేధం విధించింది. మందు తీసుకున్న క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోతుందని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పారాక్వాట్ ముందుకు విరుగుడు (యాంటీ డోస్) అందుబాటులో లేదన్నారు. పారాక్వాట్ డైకోర్లైడ్ 24 ఎస్‌ఎల్‌ను తయారుచేసే కంపెనీలు, పంపిణీదారులు, డీలర్లు, వినియోగదారులు ఈ నిషేధాన్ని పాటించాలని, ఎవరైనా అమ్మకాలు జరిపినట్టు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2,500 నుంచి మూడు వేల లీటర్లు పారాక్వాట్ డైకోర్లైడ్ 24 ఎస్‌ఎల్ నిల్వలు ఉన్నట్టు వెల్లడించారు.