బంతి పూల సందడి
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:12 PM
మన్యంలో బంతి పువ్వుల సందడి ఆరంభమైంది. జిల్లా కేంద్రం పాడేరులో పాతబస్టాండ్ బంతి పూలకు ప్రధాన కేంద్రంగా మారింది. సీజన్ ప్రారంభంలో బుట్టడు పూలు రూ.100ల వరకు ధర ఉంది. దసరా, దీపావళి, కార్తీకమాసంలో ధర రెట్టింపు కానుంది.
పాడేరులో విక్రయాలు ప్రారంభం
బుట్టడు బంతి పూలు రూ.100
దసరా, దీపావళి, కార్తీక మాసాల్లో ధర పెరిగే అవకాశం
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వర్తకులు వస్తేనే రెట్టింపు ధర
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పాతబస్టాండ్ ఆవరణలో బంతి పూల క్రయవిక్రయాలు ఆరంభమయ్యాయి. గిరిజన రైతుల వద్ద వర్తకులు పువ్వులను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరు మండలంతోపాటు హుకుంపేట, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజన రైతులు ప్రతి ఏడాది బంతి పువ్వులను సాగు చేస్తుంటారు. ఇప్పటి నుంచి డిసెంబరు మొదటి వారం వరకు పాడేరులో బంతి పువ్వుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. సీజన్ ప్రారంభంలో పది కిలోలుండే బుట్టడు పువ్వులు 100 రూపాయలకు వర్తకులు కొనుగోలు చేసుకుంటుండగా.. పండగ సీజన్‌లో రెట్టింపు కావడం, సీజన్ ముగిసే నాటికి అదే బుట్టడు పువ్వులు రూ.50 నుంచి రూ.100లకు ధర దిగజారడం సర్వసాధారణం. అనకాపల్లి, నర్సీపట్నం, తుని, కాకినాడ వర్తకులు గిరిజన రైతుల వద్ద బంతి పువ్వులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒడిశా, ఛతీస్‌గఢ్ రాష్ట్రాల వర్తకులు వస్తేనే ధర రెండింతలు పెరుగుతుందని రైతులు తెలిపారు.
మన్యం పువ్వులకు భలే డిమాండ్
ఏజెన్సీలో సహజసిద్ధంగా సాగు చేసే బంతి పూలకు ఇతర ప్రాంతాల్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే.. ఇతర ప్రాంతాల్లో పువ్వులు కోసిన రెండు, మూడు రోజుల్లో వాడిపోతాయి. దీంతో కొనుగోలు చేసిన పువ్వులను ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌లకు సకాలంలో రవాణా చేయకపోతే వర్తకులు నష్టపోయే ప్రమాదముంది. కానీ ఏజెన్సీలోని పువ్వులైతే కోసిన వారం రోజులకు గాని వాడిపోవు. అందువల్ల ఇక్కడ కొనుగోలు చేసిన పువ్వులను ఎక్కడికైనా ఎటువంటి ఆందోళన లేకుండా రవాణా చేసుకోవచ్చుననే ఽధీమాతో వర్తకులు ఏజెన్సీలోని బంతి పువ్వులను కొనుగోలు చేసేందుకు ఎగబడుతుంటారు. అధిక సంఖ్యలో గిరిజనులు సాగు చేస్తున్న బంతి పువ్వుల పంటలకు సర్కారు ప్రోత్సహిస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.