కేజీబీవీల్లో ఉద్యోగాల పేరిట ఎర
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:56 AM
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ)టీచింగ్ పోస్టులకు గత నెలలో సమగ్ర శిక్ష అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పలువురు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో వాటిని పరిశీలించి జూలై నెలాఖరున మెరిట్ లిస్ట్‌ను జారీ చేశారు. దీంతో ఇదే అదనుగా ఒక ముఠా రంగప్రవేశం చేసి పోస్టులు ఇప్పిస్తామంటూ నమ్మబలికి అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారు.
- నిరుద్యోగులను వలలో వేసుకునేందుకు కొందరి ముమ్మర ప్రయత్నాలు
- రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఇస్తే పోస్టింగ్ అంటూ ఆశ చూపిస్తున్న వైనం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ)టీచింగ్ పోస్టులకు గత నెలలో సమగ్ర శిక్ష అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పలువురు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడంతో వాటిని పరిశీలించి జూలై నెలాఖరున మెరిట్ లిస్ట్‌ను జారీ చేశారు. దీంతో ఇదే అదనుగా ఒక ముఠా రంగప్రవేశం చేసి పోస్టులు ఇప్పిస్తామంటూ నమ్మబలికి అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజుతున్నారు.
జిల్లాలోని 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్, టీచర్లు కలిపి మొత్తం 19 పోస్టులకు గత జూలైలో నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, మెరిట్ లిస్ట్ ప్రదర్శన, జూలై 25లోపు అభ్యంతరాల స్వీకరణ, ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున ధ్రువపత్రాల పరిశీలన వంటి ప్రక్రియలు నిర్వహించారు. వారిలో ప్రతిభ కలిగినఅభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయాల్సి ఉంది.
నిరుద్యోగులకు ఎర
ఎక్కడైనా ఉద్యోగాలిప్పిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు దందాలు చేయడం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం కేజీబీవీల్లో టీచర్ పోస్టులకు సంబంధించిన దందా అందుకు భిన్నంగా ఎక్కడికక్కడే గ్రామాల్లోనే మొదలుకావడం విశేషం. తమ ప్రాంతాల్లోని కేజీబీవీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి తమకు రాజకీయ నాయకులు తెలుసునని, డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. పోస్టుకు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు అవుతుందని, ముందుగా అడ్వాన్సు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్న అభ్యర్థులు వారి వలలో పడుతున్నారు. కాగా కేజీవీబీల్లో టీచర్ పోస్టులను ఇప్పిస్తామని పలువురు చాపకింద నీరులా సాగిస్తున్న దందాకు ఆదిలోనే అడ్డుకట్ట వేయకుంటే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని పలువురు అంటున్నారు. దీనిపై కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్ దృష్టి సారించాలని కోరుతున్నారు.