వెనుకబడిన చంద్రంపాలెం
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:59 AM
రాష్ట్రంలో విద్యార్థుల పరంగా సుమారు పదేళ్లపాటు అగ్రపథాన కొనసాగిన చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది.
హెచ్‌ఎం, ఉపాధ్యాయల మధ్య సమన్వయలోపమే కారణం
పరస్పరం ఫిర్యాదులతో కాలక్షేపం
డిప్యూటీ డీఈవో హోదా కలిగిన అధికారిని హెచ్‌ఎంగా నియమించాలని కోరుతున్న తల్లిదండ్రులు
నేడు పాఠశాలకు మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో విద్యార్థుల పరంగా సుమారు పదేళ్లపాటు అగ్రపథాన కొనసాగిన చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాది నుంచి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయల మధ్య తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హెచ్‌ఎం, ఉపాధ్యాయుల మధ్య గొడవలతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వేరొకచోట చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మందలించారు. అయినా పరిస్థితి చక్కబడలేదు. హెచ్‌ఎం, ఉపాధ్యాయుల మధ్య విభేదాలపై డిప్యూటీ డీఈవో విచారణ జరిపి ఇచ్చిన నివేదికను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు నివేదించారు. పాఠశాలను గాడిలో పెట్టాలని, సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఉన్నందున డిప్యూటీ డీఈవో హోదా కలిగిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కూడా కొందరిని బదిలీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాల నిర్వహణకు ప్రత్యేకించి నిధులు విడుదల చేయకపోతే హెచ్‌ఎంగా ఎవరు వచ్చినా వారిపై ఆర్థిక భారం పడుతుందని, చివరకు ఇబ్బందులు వస్తాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కాగా ప్రభుత్వ చొరవతో దివీస్ లేబొరేటరీస్ నుంచి సుమారు రూ.6.5 కోట్లు వెచ్చించి మైదానం అభివృద్ధి చేయడంతో పాటు ఆర్వో ప్లాంటు ఏర్పాటుచేసింది.
మంత్రి నారా లోకేశ్ రాక
విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి విమానంలో భోగాపురం వచ్చిన ఆయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభిరామ్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నేతలు లొడగల కృష్ణ, పుచ్ఛా విజయకుమార్, తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి లోకేశ్ నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేశారు. శనివారం ఉదయం 10.10 గంటలకు చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో దివీస్ లేబొరేటరీ నిధులతో అభివృద్ధి చేసిన క్రీడా కోర్టులను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం విజయనగరం జిల్లా పర్యటనకు వెళారు.