జిల్లా ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్
ABN , Publish Date - May 14 , 2026 | 11:34 PM
పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి నెలన్నర పసికందు కిడ్నాప్ ఘటనను పాడేరు పోలీసులు అరగంట లోపే ఛేదించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. గురువారం పాడేరులో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన విషయాలను సీఐ డి.దీనబందు విలేకర్లకు తెలిపారు.
అరగంటలో ఛేదించిన పోలీసులు
తల్లిదండ్రులకు అప్పగింత
పోలీసుల అదుపులో నిందితురాలు
పాడేరురూరల్, మే 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సలుగు పంచాయతీ బూరిగిచట్టు గ్రామానికి చెందిన పాంగి కాంతమ్మ(22) గత నెల 9వ తేదీన బాబుకు జన్మనిచ్చింది. బాలింత కాంతమ్మ ఆరోగ్యం బాగో లేని కారణంగా ఆమె నెలన్నర బిడ్డ, భర్తతో కలిసి గురువారం ఉదయం 11 గంటలకు పాడేరు జీజీహెచ్‌కు వచ్చారు. బిడ్డ ఏడుస్తుండడంతో నేను ఎత్తుకుంటానని ఒక మహిళ తీసుకొని ఆడిస్తున్నట్టు నటిస్తూ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి పరారయ్యింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆస్పత్రిలోని సీసీ పుటేజీని సేకరించి అనుమానితురాలిని గుర్తించారు. తక్షణమే జిల్లా వ్యాప్తంగా విశాఖ రేంజ్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్‌లకు సమాచారం అందించి నిందితురాలు ఫొటోను విస్తృతంగా పంపిణీ చేయడంతోపాటు స్థానిక ఆటో, జీపు డ్రైవర్లను అప్రమత్తం చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పసగాడ శ్రీనివాసరావు సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపఽథ్యంలో హుకుంపేట వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో హుకుంపేట సీఐ విజయకుమార్, హుకుంపేట ఎస్‌ఐ దుర్గప్రసాద్, సిబ్బంది నిందితురాలను అదుపులోకి తీసుకొని పసికందును సురక్షితంగా పాడేరుకు తీసుకువచ్చారు. అనంతరం పసికందుకు వైద్య పరీక్షలను నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. పసికందును అపహరించిన నిందితురాలు హుకుంపేట మండలం ఉప్ప గ్రామానికి చెందిన శాంతారి దామోదర్ భార్య కృష్ణవేణి(22)గా గుర్తించామని సీఐ దీనబందు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. నిందితురాలి గత నేర చరిత్ర, ఇతర వ్యక్తులు లేదా నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై కూడా విచారణ జరుగుతుందన్నారు. ప్రస్తుతం నిందితురాలు పోలీసుల అదుపులోనే ఉందన్నారు. పసికందు అపహరణ ఘటనను అరగంటలో ఽఛేదించిన పోలీస్ సిబ్బందికి బిడ్డ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందనలు తెలిపారు.