బాబోయ్ టోల్ బాదుడు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:28 AM
జిల్లాలోని జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ నెల నుంచి టోల్ ఫీజు 50 శాతం పెరగడంతో ఏజెన్సీ వాసులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాకుండానే టోల్ ఫీజు వసూలుపై విమర్శలు వెల్లువ
పక్కన ఉన్న హుకుంపేట వాసులు అరకులోయ వెళితే వడ్డన
ఏజెన్సీ వాసులకు ఇబ్బందికరంగా మారిన టోల్ ప్లాజా
పాడేరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ నెల నుంచి టోల్ ఫీజు 50 శాతం పెరగడంతో ఏజెన్సీ వాసులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో పాడేరు నుంచి అరకులోయ వైపు వెళితే నగదు రూపంలో రూ.50 తీసుకునే వారు. దానిని ఇప్పుడు రూ.75కు పెంచారు. ఎక్కడైనా రోడ్డు నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత టోల్ ఫీజు వసూలు చేస్తారు. కానీ జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాడేరు శివారు చింతలవీధి నుంచి అరకులోయకు కేవలం 40 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తవ్వగానే టోల్ ఫీజు వసూలు ప్రారంభించడం, క్రమంగా 50 శాతం పెంచడంతో ప్రయాణికులు, వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ వాసులు కేవలం విశాఖపట్నం, ఎస్.కోట, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండడంతో టోల్ ఫీజు సమస్య ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని కార్లు, జీపులకు ఫాస్టాగ్ అవసరం లేకుండాపోయింది. అయితే పాడేరు నుంచి అరకులోయ వెళ్లే జాతీయ రహదారిలో ఈ ఏడాది జనవరి 13 నుంచి హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్ ప్లాజాను ప్రారంభించి, వాహదారుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. పాడేరు, హుకుంపేట ప్రాంతాలకు చెందిన వాళ్లు సమీపంలో ఉన్న రంగశీల, కించుమండ, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాలకు కార్లు, జీపుల్లో వెళ్లాలంటే ప్రస్తుతం రానుపోను రూ.150 టోల్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాలకు చెందిన స్థానికులు, వర్తకులు, ఉద్యోగులు నిత్యం ఆయా నాలుగు మండలాల్లో తిరుగుతుంటారు. ఈ క్రమంలో వారి వాహనాలకు రాను పోను రూ.150 అదనంగా టోల్ ఫీజు ఖర్చు కావడంపై పెదవి విరుస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, గూడ్స్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయడం సహజం. కానీ స్థానికులు నిత్యం తిరిగే ప్రాంతాల్లో టోల్ ఫీజును చె ల్లించాల్సిన పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.