వృక్షాలపై వేటు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:59 AM
స్థానిక జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలోని భారీ వృక్షాలను భూమికంటా నరికివేస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖల నుంచి తీసుకున్న అనుమతులకు భిన్నంగా ‘వాల్టా’ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దశాబ్దాల వయసున్న చెట్లను నిర్దాక్షణ్యంగా కూల్చివేస్తున్నారు.
జలనరుల శాఖలో ఇష్టారాజ్యంగా చెట్లు నరికివేత
రెవెన్యూ, అటవీ శాఖల నుంచి అనుమతులు తీసుకోని వైనం
కార్యాలయం భవనంపై కొమ్మపడిందని... భారీ వృక్షాలకే ఎసరు
వాల్టా చట్టానికి తూట్లు
చోడవరం, జూన్ 26 (ఆంద్రజ్యోతి): స్థానిక జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలోని భారీ వృక్షాలను భూమికంటా నరికివేస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖల నుంచి తీసుకున్న అనుమతులకు భిన్నంగా ‘వాల్టా’ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దశాబ్దాల వయసున్న చెట్లను నిర్దాక్షణ్యంగా కూల్చివేస్తున్నారు.
చోడవరంలోని లక్ష్మీపురం రోడ్డులో కోనాం అతిథిగృహానికి సమీపంలో జలవనరుల శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడి ఆవరణలో చాలా ఏళ్ల కిత్రం నాటిని నిద్రగన్నేరు, యూకలిప్టస్, తదితర మొక్కలు అనంతర కాలంలో ఏపుగా పెరిగా భారీ వృక్షాలుగా ఎదిగాయి. కార్యాలయం ఆవరణ నందన వనంలా వుంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం కార్యాలయానికి చెందిన ఒక భవనంపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అధికారులు చెట్ల కొమ్మలను కాకుండా.. ఏకంగా వృక్షాలనే నిర్మూలించాలని నిర్ణయించారు. రెవెన్యూ, అటవీ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా యంత్రాలతో భూమి మట్టం వరకు చెట్లను నరికివేస్తున్నారు. ఇప్పటికే నాలుగు భారీ వృక్షాలను నరికివేయించగా, శుక్రవారం కూడా ఈ ప్రక్రియను కొనసాగించారు. ఆవరణలో ఇంకా పలు చెట్లు వున్నాయి. వాటిల్లో ఎన్నింటిని కూల్చివేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకింది. కూల్చిన చెట్లను ముక్కలుగా కోయించి ట్రాక్టర్లలో కలప డిపోనకు తరలిస్తున్నారు. నరికివేయించిన చెట్లను ఎంతకు విక్రయించారో కూడా అధికారులు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. భారీ వృక్షాల నరికివేయిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఒకవేళ చెట్ల వల్ల భవనాలకు ముప్పు పొంచివుంటే, కొమ్మల వరకు నరికించేస్తే సరిపోయేదని, ఏకంగా చెట్లను కనుమరుగు చేయడం సరికాదని అంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు మొక్కలు నాటండి, పచ్చదనాన్ని పెంచండి అని పిలుపునిస్తుంటే.. మరోవైపు జలవనరుల శాఖ అధికారులు వృక్ష విలాపానికి పాల్పడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు
కొమ్మలు మాత్రమే నరుకుతామని చెప్పారు
సింహాచలం పడాల్, అటవీ రేంజి అధికారి, చోడవరం
జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలో చెట్ల నరికివేతకు సంబంధించి అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కొమ్మలు మాత్రమే నరుకుతున్నట్టు ఫోన్ చేసి చెప్పారు. చెట్లను తొలగిస్తున్న విషయం మాకు తెలియదు. ప్రభుత్వ స్థలంలో అయినాసరే చెట్లు నరికివేయాలంటే రెవెన్యూ, అటవీ శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి.