Share News

ఆహార భద్రతా చట్టాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:45 PM

ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, గిరిజన ప్రాంతాల్లోని వారపు సంతల్లో ఆహార కల్తీ నివారణపై శ్రద్ధ పెట్టాలని జిల్లా జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు సూచించారు.

ఆహార భద్రతా చట్టాలపై అవగాహన అవసరం
శిక్షణ పొందిన వారికి కిట్లు అందిస్తున్న జిల్లా జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు, జేసీ టి.శ్రీపూజ

జిల్లా జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు

పాడేరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, గిరిజన ప్రాంతాల్లోని వారపు సంతల్లో ఆహార కల్తీ నివారణపై శ్రద్ధ పెట్టాలని జిల్లా జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు సూచించారు. ఆహార భద్రతపై కాఫీ హౌస్‌లో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారులు ఆహార భద్రతా చర్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే వీధి వ్యాపారులు ఆహార భద్రత, వినియోగదారుల విశ్వాసమే లక్ష్యంగా ముందుకు సాగాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ పేర్కొన్నారు. ఏజెన్సీలోని బ్యాంబూ చికెన్‌, అరకు కాఫీకి ఎంతో గుర్తింపు ఉందని, వాటిని మరింత నాణ్యంగా వినియోగదారులకు అందించడం ద్వారా గుర్తింపుతో పాటు తమ వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు అంగన్‌వాడీ ఆయాలు, వీధి వ్యాపారులు, పలువురు వంట వారికి ఐదు రోజుల శిక్షణ కొనసాగుతుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని జేసీ శ్రీపూజ సూచించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించిన పలు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెస్లే ఇండియా సీనియర్‌ మేనేజర్‌ డాక్టర్‌ వసీం అహ్మద్‌, ఏపీ ప్రతినిధి ఎం.సత్యనారాయణ, జిల్లా ఆహార భద్రతాధికారి ముత్యాల గ్రీష్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 10:45 PM